సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నాటకీయ పరిణామాల మధ్య కరీంగనర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. అరెస్టు విషయంపై ఆరా తీశారు. సంజయ్ అరెస్టు పరిణామాలను కిషన్ రెడ్డి అమిత్‌షాకు వివరించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సంజయ్ అరెస్టుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కోవాలని రాష్ట్ర బీజేపీ నేతలను అధిష్టానం ఆదేశించింది.
సంజయ్‌ను అరెస్టు చేసిన అనంతరం బొమ్మలరామారం పీఎస్‌కు తరలించిన పోలీసులు కాసేపట్లో హన్మకొండ కోర్టులో హాజరుపర్చనున్నారు. సంజయ్‌పై కమాలపూర్ పీఎస్‌లో పేపర్ లీకేజీ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. క్రైం నెం.60/2023, ఐపీసీ 420 సెక్షన్ 4(ఏ), 6 టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్, 66-డీ ఐటీఏ-2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కమలాపూర్ హెడ్‌మాస్టర్ శివప్రసాద్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
గుర్తు తెలియని విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఫొటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారని, తప్పని పరిస్థితుల్లో సంజయ్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. మంగళవారం అర్ధరాత్రి 12:15 గంటలకు సంజయ్‌ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు కరీంనగర్ టూ టౌన్‌లోనూ బండి సంజయ్‌పై సెక్షన్ 151 కింద మరో కేసు నమోదైంది.
చదవండి: బండి సంజయ్ అరెస్ట్.. రంగంలోకి అమిత్ షా!
Comments
Please login to add a commentAdd a comment