వరిపై మీ వైఖరి ఏంటీ? | Telangana: CM KCR Plan To Held Dharna Soon At Delhi Over Paddy Issues | Sakshi
Sakshi News home page

వరిపై మీ వైఖరి ఏంటీ?

Published Tue, Nov 16 2021 1:06 AM | Last Updated on Tue, Nov 16 2021 1:06 AM

Telangana: CM KCR Plan To Held Dharna Soon At Delhi Over Paddy Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఢిల్లీలో చేపట్టే నిరసన కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలపై మంగళవారం జరిగే పార్టీ శాసన సభాపక్ష భేటీలో దిశానిర్దేశం చేస్తారు. కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4 గం.కు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీకి హాజరు కావాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశాలు వెళ్లాయి.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరి స్తున్న ద్వంద్వ వైఖరి, రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చిస్తారు. ఈ విషయంలో అనుసరించాల్సిన భవిష్యత్‌ కార్యాచరణను కూడా మంగళవారం జరిగే టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ ప్రకటిస్తారు. ధాన్యం కొనుగోలుపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీలో ధర్నా చేపడతామని ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిపైనే ప్రధాన చర్చ ఉంటుందని చెబుతున్నా ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.  

ఎమ్మెల్సీ అభ్యర్థులపైనా చర్చ... 
శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అలాగే పూర్వ తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భేటీలో ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను శాసనసభా పక్షానికి కేసీఆర్‌ పరిచయం చేస్తారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లు. వీరిలో మెజారిటీ ఓటర్లు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. అయితే మండలి ఎన్నికల్లో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు కట్టుతప్పకుండా చూడటంతో పాటు పార్టీ ప్రకటించిన అభ్యర్థులకే ఓటు వేసేలా చేయడంలో మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భేటీలో పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధుల మద్దతు కూడగట్టడం, పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వారితో సమావేశాలు నిర్వహించడం, క్యాంపుల నిర్వహణ వంటి అంశాలపై టీఆర్‌ఎస్‌ అధినేత దిశానిర్దేశం చేస్తారు.

స్థానిక సంస్థల కోటా ఎన్నిక పూర్తయ్యేంత వరకు పూర్వ జిల్లాల వారీగా సంబంధిత జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రికి సమన్వయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వీటితో పాటు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం, పార్టీ పరంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో సంస్థాగత కార్యవర్గం ఏర్పాటు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశమున్నట్లు తెలంగాణ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement