![Telangana Congress Bus Yatra Second Schedule Postponed - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/30/CONGRESS%202.jpg.webp?itok=x_wnkShb)
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్‌షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది.
భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు.
నేటి బస్సు యాత్ర వాయిదా
సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
అగ్రనేతలతో పెద్ద సభలు
ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment