కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు గజమాలతో ఘన స్వాగతం పలుకుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పార్టీ నేతల మధ్య ఐక్యత... విజయ సోపానాలని, కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలను చేరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమితులైన తర్వాత మాణిక్యం తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు, కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులపై వరుస పోరాటాలు, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. మూడున్నర గంటలు సాగిన సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ మనమంతా టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని అన్నారు.
ప్రతి నెలలో రెండుసార్లు తప్పకుండా కొర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని, ఆ సమావేశాల్లో అన్ని విషయాలు చర్చించుకుందామని పార్టీ నేతలకు చెప్పారు. తనతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడవచ్చని, అన్ని వేళలా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్ర స్థాయి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, సోనియా వల్లనే తెలంగాణ సాధ్యమయిందని, ఆమె త్యాగాన్ని జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, కోర్ కమిటీ సభ్యులు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ
ఇటీవల కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలివిగా ఆటలాడుతున్నారని, రైతులపై కపట ప్రేమ చూపెడుతున్నారని మాణిక్యం విమర్శించారు. అన్ని బిల్లుల విషయంలో అందరి కంటే ముందుగానే బీజేపీకి, మోదీకి మద్దతిచ్చిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయాలని కోరారు. ఈ నెల 28న గవర్నర్‌కు వినతిపత్రాన్ని అందజేయాలని, అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్, మాజ్దూర్ బచావో దినంగా పాటించాలని, ఈ కార్యక్రమంలో మండల, రాష్ట్ర స్థాయి నేతలు పాలుపంచుకోవాలని కోరారు.
అక్టోబర్ 2 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికుల సంతకాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల్లో సంతకాల సేకరణ పెద్ద ఎత్తున చేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుల విషయంలో ఏఐసీసీ పిలుపు మేరకు క్షేత్రస్థాయి ఉద్యమాలు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ వ్యాపారుల కోసమే బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రైతుల పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పారు. శనివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా స్పీకప్ ఆన్ అగ్రికల్చర్ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశామని చెప్పారు. ఇంకా వరుస కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని విజయవంతం చేయాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. సమావేశంలో పొన్నాల, సంపత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని సూచించారు.
ఠాగూర్‌కు ఘన స్వాగతం
శనివారం సాయంత్రం 5 గంటలకు చెన్నై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌తో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డిలు విమానాశ్రయానికి వచ్చారు. గాంధీభవన్ వద్ద ఠాగూర్‌కు డప్పులు, భజంత్రీలు, బాణాసంచాతో పార్టీ కేడర్ స్వాగతం పలికింది.
Comments
Please login to add a commentAdd a comment