సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా కర్ణాటకలో విజయంతో తెలంగాణలో కూడా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారు.
అయితే, అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా తెలంగాణ కొత్త నినాదంతో ముందుకెళ్లేందుకు సిద్దమైంది. ‘తిరగబడదాం, తరిమికొడతాం’ నినాదంలో ప్రచారంలో దిగేందుకు రెడీ అవుతోంది. అలాగే, తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్టుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై సోమవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇదే సమయంలో ఈ ప్రజా యుద్ధానికి తెలంగాణ సిద్దం అని చాటి చెప్పడానికి 7661 899 899 నంబరుకి మిస్ట్ కాల్ ఇవ్వాలని సూచించింది. ఇక, బీఆర్ఎస్-బీజేపీ తోడు దొంగలని కరపత్రాలు ముద్రించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 75లక్షల కుటుంబాలను కాంగ్రెస్ శ్రేణులు కలవనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదు. కేసీఆర్ మోసాలను బయటపెడతామన్నారు. తెలంగాణ ఇచ్చి.. సోనియా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని అన్నారు. కేసీఆర్ తన రాజకీయాల కోసం, తన కుటుంబం కోసం తన పార్టీని బలోపేతం చేస్తున్నాడు. రాష్ట్రాన్ని దోచుకొని తన కుటుంబ సంపద పెంచుకుంటున్నారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని ప్రజలకు మాట ఇస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు.
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘విద్యార్థి, ఉద్యమకారుల ఆత్మబలిదానాలు గౌరవించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలకు విలువ ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ చెప్పాడు. తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, ప్రజల హక్కులను కాలరాశాడు.రాజులను, నియంతలను మరిపించేలా ప్రజలపై కేసీఆర్ దాడులు చేస్తున్నారు. కేసీఆర్‌ను శిక్షించేందుకే ఇక్కడ ప్రజాకోర్టులో ప్రజా ఛార్జ్ షీట్‌లు పెడుతున్నాం. ఈ ప్రజాకోర్టులో ప్రొఫెసర్ కంచె ఐలయ్య తీర్పు చెబుతారు.సామాజిక న్యాయం తెలంగాణలో భూతద్దం పెట్టి చూసినా కనిపించడం లేదు. అందుకోసమే ఈ ప్రజా కోర్టును ఏర్పాటు చేసాం. గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళతాం. తిరగబడదాం.. తరిమికొడదాం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిస్తున్నాము’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: గులాబీ గూటిలో కొత్త పొలిటికల్ హీట్..
Comments
Please login to add a commentAdd a comment