జమ్మికుంటలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాటలు హుజూరాబాద్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘రాజేందర్‌కు టీఆర్‌ఎస్ పార్టీ ఎలాంటి అన్యాయం చేయలేదు. అన్ని విషయాల్లో అండగా నిలబడింది.
సీఎం కేసీఆర్, రాజేందర్‌కు అనేక అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చారు’అని అన్నారు. ‘సీఎం శాలపల్లిని ఎన్నుకొని.. ఎన్నికలు లేకుండానే అక్కడ రైతుబంధు పథకం ప్రారంభించారు. ఆ సభలో సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ నాకు తమ్ముడు, నా కుడి భుజం అని గొప్పగా చెప్పారు’అని గుర్తు చేశారు. ‘అలాంటి రాజేందర్.. సీఎంపై ఏం మాట్లాడుతున్నారు. కేసీఆర్ నీకు గోరి కడతా అన్నారు. నిన్ను ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిపై అంతటి మాట మాట్లాడితే ఇంక నీపై విశ్వాసం ఎలా ఉంటుంది’అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్, తాను తోడుగా ఉంటామని.. అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఎక్కడైనా కోటి రూపాయల పని చేశారా అని ప్రశ్నించారు. గెల్లును గెలిపించి తనకూ హుజూరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నరేందర్, టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె.దామోదర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment