
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతిఒక్కరు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వడ్ల కొనుగోలులో బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు నాటకాలాడుతున్నాయని, 30 లక్షల ధాన్యం కొనుగోలు చేశామని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఆఖరు గింజ కొనేంతవరకు ప్రభుత్వాన్ని వదిలేది లేదని, మళ్ళీ కళ్లాల్లోకి వెళ్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధ్యయనానికి కాంగ్రెస్ నుంచి ఒక బృందం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనుందన్నారు.