చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. వరుస ఓటముల తర్వాత చెట్టుకొకరు.. పుట్టకొకరు చందంగా తయారయ్యారు. ఏ నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్ పటిష్టంగా లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. అప్పుడప్పుడూ చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో కంటితుడుపు చర్యగా పాల్గొని మిన్నకుండిపోతున్నారు. తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో నేతలు తలమునకలవగా.. కార్యకర్తలు దిక్కుతోచని స్థితిలో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం తమదేనంటూ జబ్బలు చరచడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బాబు పెద్ద జోకర్ అని నవ్వుకుంటున్నారు.
సాక్షి, చిత్తూరు: ‘వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే.. 150 సీట్లకు పైగా గెలుపు గ్యారెంటీ’’ అంటూ చంద్రబాబు మహానాడు వేదికగా డప్పు కొట్టారు. అయితే, సొంత జిల్లా చిత్తూరులోనే పచ్చపార్టీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇన్‌చార్జులే లేరు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇన్‌చార్జ్‌లూ ముఖం చాటేశారు. ఫలితంగా పార్టీ కేడర్, కార్యకర్తల్లో తీవ్ర నైరాస్యం ఆవహించింది.
వరుస ఓటములతో కోలుకోలేని దెబ్బ
2019 సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడి 23 సీట్లకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి రావడంతో ఆ పార్టీ మరింత చతికిలపడింది. దాదాపు 90 నుంచి 95శాతం వరకు స్థానాలను వైఎస్సార్‌సీసీ కైవసం చేసుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్ స్థానాల్లో పచ్చపార్టీ అడ్రస్ గల్లంతైంది. ఆ పార్టీ అధినేతతోపాటు ఇన్‌చార్జ్‌లు, కేడర్‌లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నికలంటే భయపడే స్థాయిలో ఆ పార్టీ కేడర్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ కోలుకునే స్థితి కనిపించడం లేదు.
కేడర్ వలసబాట
పార్టీ కేడర్‌నే విస్మరించిన చరిత్ర చంద్రబాబుకు మొదటి నుంచీ ఉంది. గతంలో 2014లో బీజేపీ, జనసేనతో జతకట్టి, వారి అండతో అధికారంలోకి వచ్చి, ఆ కార్యకర్తలను పక్కకు నెట్టేశారు. పదవుల్లోనూ, అధికార బలాయింపుల్లోనూ కార్పొరేట్ కల్చర్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనంలో బాబూ అడ్రస్ గల్లంతైంది. ‘‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’’ అని చెప్పుకునే చంద్రబాబు 23 సీట్లతో చతికిలపడ్డారు. తన సొంత నియోజవర్గంలో కుప్పంలోనే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన, ఓటమి అంచులు చూసి ఆఖరు నిమిషంలో గట్టెక్కారు. తర్వాత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలు, సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు. అనంతరం వరుసగా జరిగిన ఎన్నికల్లో పచ్చపార్టీ కుదేలైంది. టీడీపీ కేడర్‌లో పునరాలోచన మొదలైంది. నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌లుగా ఉండేందుకు నేతలు ముఖం చాటేస్తున్నారు. నామమాత్రంగా ఉన్నవారు కూడా వారి వ్యక్తిగత వ్యాపారాల్లో తలమునకలైపోయారు. మరికొందరి నేతల చూపు పక్క పార్టీలవైపు మళ్లుతోందనే వాదన పెరిగింది.
నగరి నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా గాలి భానుప్రకాష్ ఉన్నారు. గత ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ పోటీచేసి ఓడారు. కన్నతల్లి గాలి సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయన ఓటమిపాలయ్యారు. ఇంటిపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. గాలి భానూ ఇన్‌చార్జ్‌గా వ్యహరిస్తున్నా, పండగలు, చావులు, పెళ్లిళ్లలో కనిపించడం తప్ప కార్యకర్తలకు అందుబాటులో లేడనే వాదన ఉంది. ఒకవైపు ఇంటిపోరు మరోవైపు ఇన్‌చార్జ్ అందుబాటులోకి లేకపోవడంతో ఆ పార్టీ కేడర్, కార్యకర్తల్లో తీవ్ర నైరాస్యం నెలకొంది. ఇక టీడీపీలోనే టికెట్టు ఆశించి భంగపడిన అశోకరాజు ఈ దఫా కూడా సీటు ఆశిస్తున్నారు. సీటు ఇవ్వకుంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ పట్టుకోల్పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన లలితకుమారి, తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం లేకుండాపోయింది. కిందిస్థాయి కేడర్‌లో నైరాశ్యం నెలకొంది. దీంతో పార్టీ హైకమాండ్ పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరుకు చెందిన శ్రీనివాసుల రెడ్డిని నియమించారు. ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో పార్టీలో నిస్తేజం ఆవహించింది.
పలమనేరు నియోకజవర్గం ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన పార్టీ కేడర్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేసి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం టీడీపీలో అమరనాథ్‌రెడ్డి కీలకంగా ఉన్నారు. మిగిలినవారితో పోల్చుకుంటే ఆయన కొంత అందుబాటులో ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి మరదలు అనీషారెడ్డి పోటీ చేసి ఓడారు. తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో బాధ్యతలు చల్లా రామచంద్రారెడ్డికి అప్పగించారు. గతంలో ఆ పార్టీ తరఫున మూడు పర్యాయాలు పోటీ చేసిన బీసీ నాయకుడు వెంకటరమణరాజు 2019 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరడంతో టీడీపీ గల్లంతైంది. ఇక వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టాక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత దగ్గరయ్యారు. కేడర్, కార్యకర్తలు వలస బాట పట్టడంతో టీడీపీ ఖాళీ అయ్యింది. పైగా ఆపార్టీ ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి స్వగ్రామం రొంపిచెర్లకావడం, వ్యాపార పరంగా బిజీగా ఉండడంతో కార్యకర్తలకు అందుబాటులో లేడన్న చర్చ సాగుతోంది.
పెద్దాయనవైపు అన్ని పార్టీ నేతల చూపు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ట్రబుల్ షూటర్‌గా పేరుంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండదండలతో వైఎస్సార్‌సీపీ బాధ్యతల్ని చూస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సహచర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని గెలుపువైపు నడిపించారు. ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించారు. పెద్దాయన పేరు చెబితేనే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉలిక్కిపడుతున్నాడనే విషయాన్ని స్వయంగా పచ్చ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో విపక్ష నేతల చూపు అధికార పార్టీ వైపు మళ్లింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చల్లని చూపునకు వివిధ పార్టీల నేతలు పరితపిస్తున్నారు.
చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏఎస్ మనోహర్ 2019లో పోటీ చేసి ఓడారు. బాబు సామాజికవర్గం వారే పనిగట్టుకుని ఓడించారనే మనస్తాపంతో ఏఎస్ మనోహర్ రెండేళ్లకు ముందు ఇన్‌చార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఇన్‌చార్జ్ లేకపోవడంతో పార్టీ మూడు గ్రూపులైంది. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు బీజేపీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీలో ఆయన జాడ కనిపించలేదు. కాజూరు బాలాజీ, మాజీ మేయర్ హేమలత, చెరుకూరి వసంతనాయుడు గ్రూపు రాజకీయాల్లో తలమునకలయ్యారనే వాదన ఉంది. మరోవైపు పులివర్తి నాని, దొరబాబు, మహదేవ్ సందీప్ తెరవెనుక రాజకీయాలు నడుపుతున్నారు. ఒక వైపు ఇన్‌చార్జ్ లేకపోవడం, మరోవైపు గ్రూపు రాజకీయాలతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రతిపక్షనేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి అంచు వరకూ వెళ్లి వచ్చిన ఘనత ఆయనది. ప్రస్తుతం ఆయన తరపున ఇన్‌చార్జ్‌గా పీఎస్ మునిరత్నం వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కుప్పంలోనే పంచాయతీ, స్థానిక సంస్థలతోపాటు మున్సిపాలిటీ ఎన్నికల్లో పచ్చపార్టీ ఘోరంగా ఓటమి చవి చూడటంతో చంద్రబాబు రాజకీయ జీవితంలో పెద్ద మైనస్‌గా నిలిచిపోయింది. సీఎం వైఎస్ జగన్ ప్రభంజనంతో కుప్పంలో టీడీపీ పునాదులు కదిలిపోయాయి. దీంతో చంద్రబాబు తీవ్ర అంతర్మథనం చెందినట్టు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక పరువు నిలుపుకునేందుకే అన్నట్టుగా అడపాదడపా కుప్పంలో పర్యటిస్తూ తన ఉనికిని చాటుకునే పనిలో బాబూ తలమునకలై ఉన్నారని ఆ పార్టీ నేతలే చెబుతుండడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment