
పెందుర్తి: పొత్తులో భాగంగా జనసేన నుంచి పెందుర్తి టికెట్ ఆశిస్తున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుపై స్థానిక నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్‌లో గురువారం జరిగిన ఆత్మీయ సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు, జనసేన సీనియర్ నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్‌కు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఆత్మీయ సమావేశానికి తమకు ఆహ్వానం లేదంటూ శివశంకర్ వర్గీయులు నిరసనకు దిగారు. కొత్తగా పార్టీలోకి వచ్చినవారు పెత్తనం చెలాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర రాజకీయాలు చేయడం తప్ప ప్రోటోకాల్ మర్యాదలు తెలియవంటూ రమే‹Ùబాబు వర్గీయులపై మండిపడ్డారు. ఈ దశలో ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు వేదిక వద్దకు వచ్చే సమయం దగ్గర పడడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగేలా చేశారు.
శివశంకర్–బండారుకు చెక్
జనసేనకు సీటు కేటాయిస్తే అది తనకే ఇవ్వాలని పంచకర్ల రమేష్‌బాబు పట్టుపడుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా ముమ్మరం చేశారు. అయితే తొలి నుంచి పంచకర్లతో రాజకీయ వైరం ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి.. పంచకర్ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
టీడీపీకి అయితే తనకు, జనసేనకు అయితే శివశంకర్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంచకర్లకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితిలోనూ తాను పనిచేయనంటూ ఇరువర్గాల అధిష్టానాలకు బండారు ఇదివరకే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఆత్మీ సమావేశంలో పంచకర్ల రమేష్‌బాబు ఏకకాలంలో శివశంకర్, అతనికి బలంగా మద్దతు పలుకుతున్న బండారుకు ఏకకాలంలో చెక్ పెట్టేందుకు పావులు కదిపారు. తనకు పారీ్టలోనే ప్రత్యరి్థగా ఉన్న శివశంకర్‌తోపాటు అతని వర్గీయులెవరికీ ఈ సమావేశానికి ఆహ్వానం పంపలేదు. దీంతో శివశంకర్‌తో పాటు అతని అనుచరులు కూడా రగిలిపోతున్నారు. ఒకవేళ టీడీపీకి టికెట్ వస్తే బండారుకు పని చేయబోమని పంచకర్ల వర్గం కూడా పరోక్షంగా చెప్పినట్లైందని జనసైనికులు అంటున్నారు. ఈ సమావేశంలో జనసేన కార్యదర్శి కె.నాగబాబు మాట్లాడుతూ టీడీపీ–జనసేన–బీజేపీల పొత్తు నిర్ణయంపై స్పష్టత వచ్చాకే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.