TDP Ticket War In Srikalahasti - Sakshi
Sakshi News home page

టీడీపీలో టికెట్‌ వార్‌.. శ్రీకాళహస్తి అభ్యర్థి ఆయనేనా?

Published Mon, Jul 17 2023 12:59 PM | Last Updated on Mon, Jul 17 2023 1:40 PM

Ticket War In Srikalahasti TDP - Sakshi

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ పతనావస్థకు చేరింది. నేతల సంగతి దేవుడెరుగు.. కార్యకర్తలే కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం టికెట్‌ కోసం ఆశావహులు పోటీ పడుతున్నారనే కలరింగ్‌ ఇస్తున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ అభ్యరి్థత్వంపై హామీ ఇచ్చి మభ్యపెడుతున్నారు. ప్రధానంగా బొజ్జల సుదీర్‌రెడ్డి.. ఎస్సీవీ నాయుడు.. మునిరామయ్య మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అరకొరగా మిగిలిన శ్రేణుల్లో సైతం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం తమ్ముళ్ల నడుమ తకరారు పెట్టి చోద్యం చూస్తున్నారు. దీంతో ఏ నేత వెంట వెళితే ఏం ముంచుకొస్తుందో అని కార్యకర్తలు అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు. 

సాక్షి, తిరుపతి : శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరి రోజులు గడవక ముందే ఆ పారీ్టలో కోల్డ్‌ వార్‌ మొదలైంది. నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోసం చంద్రబాబు వేసిన ఎత్తులకు బొజ్జల, ఎస్సీవీ, సత్రవాడ బలవుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆ ముగ్గురు నాయకుల మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఓటమి తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబుకు తన సర్వేల్లో తేలిపోయింది. విషయం తెలిసినా..

బొజ్జల సు«దీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్రవాడ మునిరామయ్య, ఎస్సీవీ నాయుడు నడుమ అగ్గి రాజేసి ఆజ్యం పోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థత్వం కోసం ఈ ముగ్గురు నేతలు పోటీపడుతున్నారని, అందుకే ఎవరినీ ఖరారు చేయకుండా మభ్యపెడుతూ వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తరచూ పారీ్టలు మారే నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏపార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు నెరుపుతూ.. చిన్నగా అందులోనే చేరడం ఎస్సీవీ నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య.

అందులో భాగంగా టీడీపీ అధికారం  కోల్పోవటంతో వైఎస్సార్‌సీపీలో కొనసాగుతూ శ్రీకాళహస్తిలో చక్రం తిప్పాలని భావించారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుండటంతో వ్యక్తిగతంగా తనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదని భావించిన  ఎస్సీవీ నాయుడు మరోసారి టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. 

పార్టీలో చేరక ముందు నుంచే వర్గాలు ! 
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీచేయాలనే లక్ష్యంతో టీడీపీలో చేరిన ఎస్సీవీ నాయుడు ఆరు నెలల ముందు నుంచే తమ్ముళ్లందరితో సఖ్యతగా ఉండటం ప్రారంభించారు. బొజ్జల, మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య వర్గీయులతో తరచూ మాట్లాడుతుండటం, వారిని ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా మంతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ అ«ధినేత చంద్రబాబుని కూడా తరచూ కలిసేవారని విశ్వసనీయ సమాచారం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్‌రెడ్డిపై ప్రజల్లో సానుకూల దృక్పథం లేదని చంద్రబాబుకు పదే పదే చెప్పేవారని తెలిసింది.

అందులో భాగంగానే ఎస్సీవీని టీడీపీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యరి్థగా ఎస్సీవీకి గట్టి హామీ ఇవ్వటంతోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఎస్సీవీ నాయుడు పరోక్షంగా చెప్పుకుంటూ వచ్చారు. పార్టీని నమ్ముకుని ఉన్న బొజ్జల సు«దీర్‌రెడ్డి తనకే టికెట్‌ అని భావించి తన వంతు నియోజక వర్గంలో పర్యటించటం, నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడటం చేస్తున్నారు. అయితే చంద్రబాబు లోపాయికారీ ఒప్పందంలో భాగంగా ఎస్సీవీ నాయుడికే టికెట్‌ అనే విషయం బొజ్జలకు ఆలస్యంగా తెలియటంతో పలుమార్లు సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.   

బస్సుయాత్రలో బయటపడిన విభేదాలు 
టీడీపీ నేతలు చేపట్టిన బస్సుయాత్రలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తనకు చంద్రబాబు ఇచ్చిన హామీని  ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు తనకు పొలం ఇచ్చారని, అందులో తననే సాగు చేసుకోమని చెప్పారని పరోక్షంగా తెలియజేశారు. సందర్భం లేకుండా ఎస్సీవీ నాయుడు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనే విషయం టీడీపీ శ్రేణులకు అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న బొజ్జల సుదీర్‌రెడ్డి మాత్రం ఎస్సీవీ నాయుడు వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదని, నేటి వరకు శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్‌ తానేనని బహిరంగంగా చెప్పుకుంటూ వస్తున్నారు.

అదే విధంగా మరో వైపు మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కూడా తన వంత  తాను ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే పైకి తామంతా ఒక్కటేనని, ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని చిలక పలుకులు వల్లిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల బొజ్జల సు«దీర్‌రెడ్డి, ఎస్సీవీ నాయుడు, సత్రవాడ మునిరామయ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరికి వారు తనకే టికెట్‌ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం.

తాజాగా బస్సుయాత్రలోనే ఎస్సీవీ నాయుడు, ఆయన వర్గీయులకు బొజ్జల ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులను బస్సులో ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారే ప్రచారం జరుగుతోంది. 

ఇలాగైతే కొనసాగలేం 
అడుగడుగునా అవమానాలు భరిస్తూ టీడీపీలో కొనసాగలేమని ఎస్సీవీ నాయుడు ముఖ్య అనుచరుడు శివా యాదవ్‌ తదితరులు ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీలో నిమ్న వర్గాలకు ప్రాధాన్యత లేదని మీడియా ఎదుట వాపోయారు. ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ బస్సు యాత్రలో పాలుపంచుకున్న తనపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుదీర్‌ రెడ్డి అనుచితంగా ప్రవర్తించారని శివ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎస్సీవీ నాయుడు అనుచరుడినని చెబుతున్నా వినకుండా  బస్సు దిగమన్నాడని, అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషిస్తూ అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు.

విజయవాడలో చంద్రబాబు నాయుడుని ఎస్సీవీ సుమారు 500 మందితో కలిశారని, అప్పుడు కూడా బొజ్జల సుధీర్‌కి టికెట్‌ ఇస్తామని పార్టీ అధినేత చెప్పలేదని వివరించారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని మాత్రమే చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ ఆఫీసుకి వస్తే దాడి చేస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, బొజ్జల సు«దీర్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందని శివ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీవీ నాయుడు వర్గం దూసుకుపోవడం సహించలేక బొజ్జల సు«దీర్‌ రెడ్డి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు చేయటం గమనార్హం.   

తుస్సుమన్న బస్సు యాత్ర! 
– వరదయ్యపాళెంలో వెలవెల పోయిన రచ్చబండ 
వరదయ్యపాళెం: సత్యవేడు నియోజకవర్గంలో ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజాదరణ కరువైంది. ఆదివారం బుచ్చినాయుడుకండ్రిగ మండలం పల్లమాల నుంచి యాత్ర ప్రారంభించారు.  బీఎన్‌కండ్రిగ, వేణుగోపాలపురం మీదుగా వరదయ్యపాళెంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంతో యాత్ర ముగిసింది. అయితే రచ్చబండ జనం లేక వెలవెల పోయింది.  

రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ వారి ఊక దంపుడు ప్రసంగాలు వినలేక జనం నెమ్మదిగా జారుకున్నారు. అంతకు ముందు వరదయ్యపాళెంలో నిర్వహించిన ర్యాలీలో సైతం పట్టుమని 100 మంది కూడా లేకపోవడం గమనార్హం. కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్షి్మ, మాజీ ఎమ్మెల్యేలు హేమలత, ఎస్సీవీ నాయుడు, సుగుణమ్మ, పరసారత్నం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి హెలన్‌ ఉన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement