సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న హరీశ్‌రావు, పువ్వాడ, నామా, కౌశిక్‌రెడ్డి, రాజేశ్వరరెడ్డి తదితరులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు, యూపీ మాజీ సీఎం, ఇతర జాతీయస్థాయి నేతలు హాజరవుతుండటంతో పోలీసులు, అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ సభా ప్రాంగణం, కలెక్టరేట్ ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
ఇక ప్రముఖుల పర్యటనకు సంబంధించి ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైనట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఈ నెల 17న రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. 18న ఉదయం వారు సీఎం కేసీఆర్‌తో కలసి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఖమ్మంకు చేరుకుంటారు. బీఆర్‌ఎస్ తొలి సభకావడంతో సెంటిమెంట్‌గా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది.
అభివృద్ధి పనులు ప్రారంభించి సభకు..
18న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎంలు, ఇతర ప్రముఖులు ఖమ్మం కొత్త కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడే మెడికల్ కాలేజీ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రా రంభిస్తారు. తర్వాత సభా వేదికకు చేరుకుంటారు.
క్యూఆర్ కోడ్‌తో పార్కింగ్‌కు కసరత్తు
సభ ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తుండగా.. వేదికను తీర్చిదిద్దే బాధ్యతను టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. వేదికపై ముఖ్య నేతలతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఇల్లెందు, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో.. సూర్యాపేట మీదుగా వచ్చే వాహనాలకు ముదిగొండ, కోదాడ క్రాస్‌రోడ్డు మీదుగా ప్రకాశ్‌నగర్, మమత రోడ్డులో ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలాల్లో.. భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర నుంచి వచ్చే వాహనాలకు వైరా రోడ్డులోని అమ్మపాలెం సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చే వాహనాలకు ఒక్కో క్యూఆర్ కోడ్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నేతలకు వివిధ బాధ్యతలు..
ఖమ్మం సభ విజయవంతానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు 24 మందితో టీమ్ సిద్ధమైంది. అందులో మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. సభకు సంబంధించి మొత్తంగా మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించనుండగా.. ఆయన సారథ్యంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు సభకు ఇన్‌చార్జులుగా ఉంటారు.
దేశం దృష్టిని ఆకర్షిస్తుంది: హరీశ్, పువ్వాడ
ఖమ్మం బీఆర్‌ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని.. అందుకు తగినట్టు ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. బుధవారం సభ స్థలాన్ని, కొత్త కలెక్టరేట్‌ను వారు పరిశీలించారు. కలెక్టర్, పోలీసు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సభ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత మొదటి బహిరంగ సభను ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నామని.. దీనికి ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు. సభ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై 4.30 వరకు కొనసాగుతుందన్నారు. భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తుమ్మలతో మంత్రుల భేటీ
దమ్మపేట: ఖమ్మం సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, ఇతర నేతలు బుధవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. తుమ్మల ఆతిథ్యాన్ని స్వీకరించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలపై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టుగా కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారు తుమ్మలను కలవడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment