సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి వంటివన్నీ ఒక్క వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతున్నాయని.. ఈసారి కేసీఆర్ కుటుంబాన్ని ఓడించాలన్నదే ప్రజల నిర్ణయమని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమం చేశారనే గుడ్‌విల్‌తో 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని.. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తును రాజకీయ ప్రయోజనానికి, సెంటిమెంట్‌కు వాడుకుని 2018లో గట్టెక్కారని చెప్పారు.
కానీ ఈ పదేళ్లలో కేసీఆర్ గుడ్‌విల్ జీరో అయిందన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనంలోకి తెచ్చుకుని, కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే అపోహలు పటాపంచలు అయ్యాయన్నారు. ఓవైపు కేసీఆర్ కూటమిలో బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఉంటే.. మరోవైపు తమ కూటమిలో కాంగ్రెస్‌తోపాటు టీజేఎస్, ప్రజా సంఘాలు, కలసివస్తే లెఫ్ట్ పార్టీలు ఉన్నాయని తెలిపారు.
ఏ కూటమి కావాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘నా 20ఏళ్ల అనుభవంతో చెప్తున్నా. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఈసారి తప్పకుండా ఓడిస్తారు. తెలంగాణలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి వంటివన్నీ ఒక్క వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతున్నాయి. తెలంగాణను టీజీ నుంచి టీఎస్‌గా మార్చడంలో, తెలంగాణ అధికారిక చిహ్నంలో కేసీఆర్ రాచరిక పోకడలు కనిపిస్తున్నాయి. త్యాగాల గుర్తుగా ఉండాల్సిన తెలంగాణ చిహ్నం రాచరికానికి దర్పణంగా నిలుస్తోంది.
గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస అనేది కేసీఆర్ పోకడ. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడి బతికే రోజులు వచ్చాయి. ఇది తెలంగాణకు మంచిది కాదు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్. ఈ పదేళ్లలో మొత్తం రూ.22.71లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అవన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? తెలంగాణ ప్రజల భవిష్యత్తు, బంగారు తెలంగాణ ఏమయ్యాయి? కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరూ పరోక్షంగా, ప్రత్యక్షంగా బాధితులే.
అందుకే మేడిగడ్డ కుంగింది
కేసీఆర్ పాపాల పుట్ట పగిలినందుకే మేడిగడ్డ కుంగింది. మేడిగడ్డ కుంగిందో లేదో, నాణ్యతా లోపం ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం అక్కడికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. మీడియాను, ఇంజనీర్లను కూడా తీసుకెళ్లాలి. కేసీఆర్ అంటే టీఆర్‌ఎస్ వాళ్లకు కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లలా అనిపిస్తే మాకు మాత్రం కాళేశ్వరం కరప్షన్ రావు అనిపిస్తోంది. మేం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే రైతుబంధు ఇస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి ఉంటే అమలు చేసేవాళ్లం. దాంతో కేసీఆర్ వచ్చి తానే రైతుబంధును సృష్టించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు.
పాలనపై చర్చిద్దాం వస్తారా?
కాంగ్రెస్ హయాంలోని పదేళ్లలో (1994–2004), బీఆర్‌ఎస్ హయాంలో (2004–14) ఏం జరిగిందో చర్చించేందుకు మేం సిద్ధం. వచ్చే పదేళ్లలో ఏం చేస్తామో కూడా ప్రజలకు చెబుదాం. కేసీఆర్ చర్చకు రావాలి. లేదంటే హరీశ్, కేటీఆర్‌లలో ఎవరొచ్చినా పర్వాలేదు. బీజేపీ, ఎంఐఎం ప్రతినిధులను కూడా పిలవాలి. ఏ పార్టీ విధానమేంటో? ఏ పార్టీ ఏం చేసిందో? ఆరోగ్యకర వాతావరణంలో చర్చించుకుందాం. నాతోపాటు కాంగ్రెస్ పక్షాన సీఎల్పీ నేత భట్టి వస్తారు.
హైదరాబాద్‌ను వరల్డ్ డెస్టినీగా మారుస్తాం
కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సంపదను సృష్టిస్తే ఆ ఆదాయాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మా వద్ద మెగా మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ నగరాన్ని వరల్డ్ డెస్టినీగా మారుస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా మూసీ చుట్టూ అద్భుత ప్రణాళికను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తాం. రోడ్లు వేస్తాం.అర్బన్, సబర్బన్, రూరల్ తెలంగాణను మూసీతో కనెక్ట్ చేస్తాం. నదిని ప్రక్షాళన చేస్తాం.
ఇరువైపులా రేడియల్ రోడ్లు వేసి నల్లగొండ వరకు డిస్నీవరల్డ్ లాగా, సింగపూర్ అమ్యూజ్‌మెంట్ పార్కుల్లాగా ప్రాజెక్టును అమలు చేస్తాం. హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ గుట్టల్లో 25–30 వేల ఎకరాల్లో ప్రజల భాగస్వామ్యంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రణాళిక మా వద్ద ఉంది.
లెఫ్ట్‌తో చర్చలు ముగియలేదు
కాంగ్రెస్ పక్షాన వామపక్షాలతో సీఎల్పీ నేత భట్టి, వంశీచంద్‌రెడ్డి చర్చలు జరిపారు. ఇవి ముగిశాయని నేను అనుకోవడం లేదు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ సహజ మిత్రులు. చర్చల సారాన్ని త్వరలోనే వెల్లడిస్తాం. ధరణిని సమూలంగా మారుస్తాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సరికొత్త వెబ్‌సైట్‌ను తీసుకొస్తాం.
సోనియా వల్లే తెలంగాణ సాకారం
ఏపీలో కాంగ్రెస్‌పై రాజకీయ అణుబాంబు పడుతుందని తెలిసినా ధర్మం వైపు నిలబడేందుకే సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆమె ఆ నిర్ణయం తీసుకోకపోతే 100 మంది కేసీఆర్‌లు వచ్చి వెయ్యేళ్లు ఉద్యమించినా తెలంగాణ వచ్చేది కాదు. ప్రాణత్యాగాల గురించి మాత్రమే మాట్లాడితే.. 1,200 మంది అమరుల తర్వాత కేసీఆర్ ప్రాణం 1,201వది అయ్యేది. అంతకన్నా జరిగే నష్టం ఏమీ ఉండేది కాదు. తెలంగాణ ప్రజల డిమాండ్‌కు శాశ్వత పరిష్కారం కోసమే సోనియా తెలంగాణ ఇచ్చారు..’’అని రేవంత్ పేర్కొన్నారు.
కేటీఆర్.. గన్నేరు పప్పు
తనను పప్పు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ‘‘అవును నేను పప్పునే. కందిపప్పును. కొడంగల్ ప్రాంతంలో పండే కందిపప్పును. ప్రోటీన్లు ఎక్కువ ఉండి ప్రపంచ ఖ్యాతి ఆర్జించిన కందిపప్పును. కానీ కేటీఆర్ మాత్రం గన్నేరు పప్పు. ఆరోగ్యంగా ఉండాలంటే కందిపప్పు, ముద్దపప్పు తింటారు. కానీ గన్నేరు పప్పు తింటే చస్తారు..’’అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment