సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కొత్త రథసారథులు రాబోతున్నారు. అన్ని జిల్లాల్లో వచ్చే నెలాఖరుకల్లా టీఆర్‌ఎస్ పార్టీ, ధాని అనుబంధ సంఘాల కమిటీలు వేయాలని గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ మేరకు ఉమ్మడి వరంగల్ నేతలకు సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలి సింది. గ్రామ, డివిజన్ స్థాయి నుంచి జిల్లా కమిటీల రూపకల్పనకు జిల్లాల వారీగా ఇన్‌చార్‌్జలను కూడా నియమించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 2న జెండా పండుగతో మొదలయ్యే టీఆర్‌ఎస్ సంస్థాగత సందడి నెలాఖరుకల్లా ముగియనుంది. ఆ లోపు ఆరు కమిటీలు, అనుబంధ సంఘాల జాబితాలు, నివేదికలు ఆయా జిల్లాల నేతలతో మాట్లాడి ఇవ్వాలని ఇద్దరు మంత్రులకు సూచించినట్లు సమాచారం.
చదవండి: జిరాక్స్ పేపర్లతో వచ్చి షో చేశాడు: మంత్రి మల్లారెడ్డి
జెండా పండుగ నుంచి సందడి..
పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షుడితో కలిపి 25మంది, అనుబంధ సంఘాలకు 15మంది చొప్పున ఉండేలా పార్టీ మార్గదర్శకాలు, సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా కమిటీలను రూపొందించనున్నారు. ఈ మేరకు పలు దఫాలు ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సేకరించిన సమాచారం మేరకు జిల్లా రథసారథుల పేర్లు దాదాపుగా ఖరారు చేస్తారని సమాచారం. అయితే సెప్టెంబర్ 1న ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మాణంకు శంకుస్థాపన జరగనుండగా, ఆ మరుసటి రోజు (సెప్టెంబర్ 2) నుంచి పార్టీ జెండా జెండా పండుగలు నిర్వహించాలని అధిష్టానం కేడర్‌కు సూచించింది. అదే రోజు నుంచి గ్రామ కమిటీల నిర్మాణం మొదలవుతుంది. 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు వేయనుండగా, 12 నుంచి 20 వరకు మండల కమిటీలు పూర్తి చేసి, 20 నుంచి నెలాఖరు వరకు జిల్లా కమిటీలు వేయనున్నారు.
పోటాపోటీగా ఆశావహులు.. ఏ జిల్లా నుంచి ఎవరు...
సుమారు ఐదారేళ్ల తర్వాత జిల్లా కమిటీలు తెరపైకి రావడంతో పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పగ్గాలను చేపట్టేందుకు తహతహలాడుతున్నారు. గాడ్‌ఫాదర్‌ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. హనుమకొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు జన్ను జకారియా, గుడిమల్ల రవికుమార్, తాడిశెట్టి విద్యాసాగర్, టి.జనార్దన్ గౌడ్ తదితరుల పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈ జిల్లాలో చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, టి.రాజయ్య, సతీష్‌కుమార్ తదితరులు ప్రభావం చూపనుండగా, సమీకరణలు మారే అవకాశం కూడా ఉంది.
వరంగల్ జిల్లా నుంచి జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, చింతం సదానందం, నిమ్మగడ్డ వెంకన్న, డాక్టర్ మదన్‌లతోపాటు వరంగల్, నర్సంపేట ప్రాంతాలకు చెందిన ఐదుగురు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో నలుగురు ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డిల పేర్లు మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీందర్‌రావుకు ఈ పదవి చిన్నది కాగా, మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌ల వర్గపోరు ఎవరికీ అవకాశం ఇస్తుందో చూడాలి.
జనగామ జిల్లాలో ప్రధానంగా జెడ్పీ మాజీ చైర్మన్ గద్దల పద్మ భర్త నర్సింగరావు, లింగాల ఘన్‌పూర్ ఎంపీపీ జయశ్రీ భర్త చిట్ల ఉపేందర్‌రెడ్డి, ఇర్రి రమణారెడ్డి, చేవేళ్ల సంపత్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిల ఆశీస్సులున్న వారే ఈ జిల్లా పగ్గాలు చేపట్టగలరన్న ప్రచారం ఉంది. ములుగు జిల్లా నుంచి కాకులమర్రి లక్ష్మ ణ్‌రావు, గోవింద్‌నాయక్, గోవిందరావుపేట జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు అజ్మీర ప్రహ్లాద్‌లు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. 2004లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన గోవింద్‌నాయక్‌కు పలు సందర్భాల్లో పదవులు వచ్చినట్లు వచ్చి చేజారాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి పలువురు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు టీఆర్‌ఎస్‌లో చేరిన బుర్ర రమేష్, క్యాతరాజు సాంబమూర్తి, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శోభ భర్త కల్లెపు రఘుపతిరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ కొత్త హరిబాబుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కుమారుడు సిరికొండ ప్రశాంత్, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment