సాక్షి, హైదరాబాద్: ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తనను కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అంటున్నారు. మంగళవారం సాయంత్రం మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
‘‘తెలంగాణలో ప్రతిపక్ష నేత లేనే లేరు. ఉంటే ఆయన అసెంబ్లీకి వచ్చేవారు కదా. అసెంబ్లీకి రాని నేత అసలు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు. ప్రధానిని పెద్దన్న అనడంలో తప్పేం ఉంది?. దేశానికి ప్రధాని పెద్దన్నే కదా. కేసీఆర్ లాగా మోదీకి నేను చెవిలో ఏం చెప్పలేదు. రాష్ట్రానికి రావాల్సిన విషయాల్నే మైకులో చెప్పాను..
.. కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేస్తే.. వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. కాళేశ్వర్రావు కట్టిన మేడిగడ్డ మేడి పండు అయ్యింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే బ్యారేజ్ కూలిపోయింది. మేడిగడ్డను రిపేర్ చేయాలని కేసీఆర్ కోరడం తప్పును కప్పిపుచ్చుకోవడమే అవుతుంది. మేడిగడ్డ దొంగలంతా మా వెంట రాకుండా ప్రత్యేకంగా వెళ్లి చూసొచ్చారు. అలాగే.. కేసీఆర్‌పై లీగల్ చర్యలకు ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్‌గా కేంద్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రేవంత్ అన్నారు.
.. కేసీఆర్ చదివింది బీఏ. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చదివినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మాకు మిత్రుడేం కాదు. నన్ను ఇతర పార్టీ ఎమ్మెల్యే లు కలవడం లో ఎలాంటి రాజకీయం లేదు. సీఎం ను ఎమ్మెల్యే లు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ లేనే లేదు. లేని పార్టీని ఎందుకు తిట్టాలి. కర్ణాటకలో 40 శాతం కమీషన్‌పై మోదీ ఎందుకు మాట్లాడరు?. జీఎస్టీ వసూళ్లలో పెద్ద కుంభకోణమే జరిగింది. ఆ దొంగల్ని బయటకు తీస్తున్నాం. ప్రభుత్వం పడిపోతుందని కొందరు పిచ్చిపట్లినట్లు మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలి..
ఇంకా సీఎం రేవంత్ ఏమన్నారంటే..
.. సస్పెండైన ప్రణీత్ రావ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజు కు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది. జీఏస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది. ఎల్ ఆర్ ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం. సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతుంది... చర్యలు తీసుకుంటాం. మా పరిపాలన రిఫరెండం గా ఎన్నికలకు వెళ్తాం. 14 కు పైగా సీట్లు గెలుస్తాం... మా కుటుంబం లో ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరు..
.. ట్యాక్స్ పేయర్స్ కు రైతు బంధు ఎందుకు? వ్యవసాయం చేసే వారికే రైతు బంధు. అసెంబ్లీ లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అన్ని ప్రైవేటు యూనివర్సిటీ లపై విచారణ జరుపుతాం. జీవో 3 పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ తెలంగాణ లో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment