సాక్షి, హైదరాబాద్: బీజేపీ తుల ఉమ తన ముఖ్య అనుచరులతో తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. సోమవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కండువా కప్పి ఉమను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో గతంలో కంటే ఉమకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ మీడియా సమక్షంలో హామీ ఇవ్వగా.. టికెట్ విషయంలో హ్యాండ్ ఇచ్చిన బీజేపీపై ఉమ విమర్శలతో విరుచుకుపడ్డారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం. ఇది మహిళలకే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ ఉమక్కను(తుల ఉమను ఉద్దేశించి..) అవమానించింది. తెలంగాణ ఉద్యమ కాలం నాటినుంచి సీనియర్ నేతగా, నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఉమక్క పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా.. బీఆర్‌ఎస్ ఇంటిబిడ్డగా సేవలందించిన ఉమక్కకు బీజేపీలో ఇటువంటి అవమానం జరగడం బాధగా ఉంది. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము..నిరసిస్తున్నాం.
.. అందుకే ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ స్వయంగా సూచించారు. ఆయన సూచన మేరకు ఇవాళ ఆహ్వానం పలుకుతున్నాం. మా ఇంటి ఆడబిడ్డగా మా ఆహ్వానం మన్నించి రావడం సంతోషం. గతంలో వున్న హోదాకంటే కూడా మరింత సమున్నత హోదాను, బాధ్యతలను ఉమక్కకు అప్పగిస్తాం. సముచితంగా గౌరవించుకుంటాం. ఇందుకు సంబంధించిన బాధ్యతను నేనే స్వయంగా తీసుకుంటా. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఉమక్క సేవలు అవసరం. తుల ఉమక్కకు పుట్టిన గూటికి పునః స్వాగతం’’ అని అన్నారు.
తుల ఉమా మాట్లాడుతూ..
‘‘బీజేపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారు. బీజేపీలో బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక కల మాత్రమే. అందుకు ఉదాహరణ నేనే. నాకు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి. బీజేపీ కేవలం అగ్రవర్ణాల పార్టీ. కింది స్థాయి కార్యకర్తలను కేవలం వాడుకుంటుంది. గతంలో బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్)లో ఉన్నప్పుడు అనేక హోదాల్లో పని చేశా. కానీ, బీజేపీలో అలాంటి గౌరవం ఏమీ దక్కలేదు. ఇప్పుడు నా సొంత గూటికి వచ్చినట్లు ఉంది. సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో పార్టీ కోసం పని చేస్తాం. బీజేపీ కార్యకర్తల్లారా.. ఆగం కాకండి. పార్టీ మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటోంది. ఆ విషయం గుర్తించండి’’ అని అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment