దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి కొససాగుతోంది. ఈ నేపధ్యంలో పలు వింతలు, విడ్డూరాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీకిదిగే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల గురించి అందరికీ ఎంతోకొంత తెలిసేవుంటుంది. అయితే ఎవరికీ అంతగా తెలియని ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఆ పార్టీ పేరు ‘ఢాయీ అక్షర్’ అంటే రెండున్నర అక్షరాలు. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తోంది?
భక్త కబీర్ ఒక శ్లోకంలో ఢాయీ అక్షర్ అనే పదాన్ని ప్రయోగించారు. ‘శ్రీరాం’ అనే అర్థంతో కబీర్ దీనిని ఉపయోగించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన రాకేష్ సోంకర్ ‘ఢాయీ అక్షర్’ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆయన రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జబల్‌పూర్ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆయన స్థాపించిన ‘రెండున్నర అక్షరాల పార్టీ’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌లతో తలపడనుంది. కాగా రాకేష్ 13వ సారి ఎన్నికల బరిలో దిగారు. ఇప్పటి వరకు ఆయన ఆరు అసెంబ్లీ, ఐదు లోక్ సభ, ఒక మేయర్ ఎన్నికల్లో పోటీ చేశారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన రాకేష్ సోంకర్‌కు ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది. అందుకే ఆయన ఇటీవల ఆటోడ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఎన్నికల ఫిలాసఫీ కూడా ఎంతో విచిత్రంగానే ఉంది. తాను ఎన్నికలకు ప్రచారం చేయబోనని ఆయన ప్రకటించారు. అయితే ప్రచారం ద్వారా రాకేష్ తన అభిప్రాయాలను ఎవరికీ తెలియజేయనప్పుడు ఆయనకు ఓటు వేసేదెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అందుకే తాను కూడా ఎన్నికల బరిలో దిగానని రాకేష్ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment