Uttar Pradesh Assembly Elections 2022: Priyanka Gandhi Strategy For UP - Sakshi
Sakshi News home page

UP Assembly Elections 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ’’నేను అమ్మాయిని, నేను పోరాడగలను’’

Published Fri, Jan 21 2022 6:07 AM | Last Updated on Sat, Jan 22 2022 11:42 AM

Uttar Pradesh Assembly Elections 2022: Priyanka Gandhi Strategy For Uttar Pradesh - Sakshi

Uttar Pradesh Assembly Elections Updates: అచ్చంగా నానమ్మ ఇందిరను తలపించే రూపం, చక్కటి గ్రామీణ హిందీ భాషలో అనర్గళంగా ప్రసంగించే నైపుణ్యం, మురికివాడల ప్రజలతో అరమరికలు లేకుండా కలిసిపోయే తత్వం,  తల్లి సోనియా గాంధీ అనారోగ్యం, అన్నింటికి మించి ఘనమైన రాజకీయ కుటుంబ నేపథ్యం,  ఇవన్నీ కాంగ్రెస్‌లో ప్రియంకానికి తెరలేచింది.

కెమెరాల సాక్షిగా అన్న రాహుల్‌ భుజాల చుట్టూ చేతులు వేసి కలిసి నడిచిన  ప్రియాంకా గాంధీ వాద్రా యూపీ కాంగ్రెస్‌ని అంతా తానై, అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. యూపీలో అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ఉనికిని చాటేలా నిలబెట్టాలని ఐదారు నెలలుగా దాదాపు అక్కడే ఉండి కష్టపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా ముందు నిలబడలేకపోయినా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ’’నేను అమ్మాయిని, నేను పోరాడగలను’’ అని నినదిస్తూ రాజకీ యాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు.
 
► దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ గారాలపట్టి ప్రియాంక 1972, జనవరి 12న ఢిల్లీలో పుట్టారు.
► ఢిల్లీలోని మోడర్న్‌ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు.
► ఢిల్లీ యూనివర్సిటీలో జీసస్‌ మేరీ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ పట్టా తీసుకున్నారు.  
► 2010లో బుద్ధిజంలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు.  
► 17 ఏళ్ల వయసులో 1989 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా తన తండ్రి రాజీవ్‌గాంధీ తరఫున అమేథి నియోజకవర్గం నుంచి ప్రచారం చేశారు.  
► తన క్లాస్‌మేట్‌ మిషెల్‌ అన్న, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రాతో టీనేజ్‌లోనే ప్రేమలో పడ్డారు.  
► 1997లో ఫిబ్రవరి 18న రాబర్ట్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి రెహాన్‌ అనే కుమారుడు, మిరాయా అనే కుమార్తె ఉన్నారు.  
► ప్రియాంకా గాంధీకి బౌద్ధమతంపై అపారమైన నమ్మకం. దానినే ఆచరిస్తారు.  
► 1999 నుంచి 2019 వరకు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా కాంగ్రెస్‌ పార్టీతో మమేకమై ఉన్నారు.  
► టికెట్ల పంపిణీ, భాగస్వామ్యపక్షాలతో చర్చలు,  సోనియా, రాహుల్‌ల గెలుపు కోసం రాయ్‌బరేలి, అమేథి నియోజవర్గాలలో ఎన్నికల వ్యూహరచన వంటి బాధ్యతలు తీసుకున్నారు
► ప్రియాంక మంచి వక్త. అమితాబ్‌ బచ్చన్‌ తల్లి తేజీ బచ్చన్‌ దగ్గర హిందీ భాషలో శిక్షణ తీసుకున్నారు. అమితాబ్‌ తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ హిందీలో సుప్రసిద్ధ కవి. హిందీ భాషపై అద్భుత పట్టున్న కుటుబం దగ్గర శిక్షణ తీసుకున్న ప్రియాంక సభల్లో వాడుక భాషలో సామాన్యులు మాట్లాడే పదబంధాలు వాడుతూ ప్రసంగిస్తారు. ప్రసంగాల్లో ప్రజలకి సూటిగా ప్రశ్నలు వేస్తూ, వారి నుంచి సమాధానాలు రాబడుతూ ఇద్దరి మధ్య ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రియాంక ప్రత్యేకత.  
► ప్రియాంకలో ఉన్న ఈ లక్షణాలతో ఎన్నికలు జరిగిన ప్రతీసారి ఆమె రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు డిమాండ్‌ చేసేవారు.  2014 లోక్‌సభ ఎన్నికల సమయానికి సోనియా అనారోగ్యం బారినపడడం, రాహుల్‌ గాంధీ సమర్థతపై నీలినీడలు కమ్ముకోవడంతో కాంగ్రెస్‌ పార్టీని ప్రియాంకే కాపాడగలరనే భావన ఏర్పడింది.  
► ఎట్టకేలకు అందరి డిమాండ్లకు తలొగ్గి 2019 జనవరి 23న క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీ యూపీ తూర్పు వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.  
► 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ అంతటా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా ముందు నిలబడలేక చతికిలపడిపోయారు.  
► 2020 సెప్టెంబర్‌ 11న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి ప్రజా సమస్యలపై పోరాడడంలో తనకంటూ ఓ ముద్రని వేసుకున్నారు.  
► భర్త రాబర్ట్‌ వాద్రాపైనున్న అవినీతి కేసులే రాజకీయంగా ఆమెని ఇబ్బందికి లోను చేస్తున్నాయి.  
► ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంపిణీలో కొత్త బాటలు వేశారు. యూపీలో న్యాయం దక్కక పోరుబాట పట్టిన వారిని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వారిని, సామాజిక కార్యకర్తల్ని, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల్ని ఏరికోరి ఎంపిక చేసి పార్టీ టిక్కెట్లు ఇచ్చారు.  
► మరే పార్టీ చేయని విధంగా మహిళలకు 40% టికెట్లు ఇస్తానని ప్రకటించారు. మై లడ్కీ హూ.. లడ్‌ సక్తి హూ (ఆడపిల్లను.. పోరాడగలను ) అని నినదిస్తూ  ఎన్నికల చదరంగంలో పావులు కదుపుతున్నారు
.  
    
– నేషనల్‌ డెస్క్, సాక్షి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement