అత్యధికంగా 80 మంది పార్లమెంటు సభ్యులను లోక్‌సభకు పంపే ఉత్తరప్రదేశ్ రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రం. అన్ని రాజకీయ పార్టీలను గేమ్‌చేంజర్‌గా మార్చే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. సాధారణంగా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లాలంటే ఉత్తరప్రదేశ్ దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. రాజకీయంగానూ ఈ రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు సాధించిన పార్టీలకే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇది ‘ఢిల్లీ’కి వెళ్లే దారి..
గత ఫలితాలను చూస్తే..
2019 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో 62 లోక్‌సభ సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) రెండు స్థానాలను గెలుచుకుంది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) 10 సీట్లు సాధించగా, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే దక్కించుకోగలిగింది.
కాగా 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 71 లోక్‌సభ స్థానాల్లో భారీ విజయాన్ని సాధించింది. ఎస్పీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు, ఇతరులు రెండు సీట్లు సాధించగా బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో ఈసారి కూడా గత రెండు సార్వత్రిక ఎన్నికల విజయాన్ని పునరావృతం చేయాలని ఆశిస్తోంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కూడా కాషాయ పార్టీ విజయం సాధించింది. పోలింగ్ జరిగిన పది స్థానాల్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ప్రతిపక్ష ఎస్పీ రెండు స్థానాలను చేజిక్కించుకుంది.
అందరి దృష్టి ఆ స్థానం పైనే..
రాష్ట్రంలో మొత్తం 80 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 63 అన్‌రిజర్వ్‌డ్ సీట్లు కాగా, 17 సీట్లు ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ అయ్యాయి. రాష్ట్రంలోని వారణాసి, రాయ్‌బరేలీ, లక్నో, అమేథీ కీలక నియోజకవర్గాలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం అయిన వారణాసి స్థానంపైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి. ఇటీవలే, కాంగ్రెస్, ఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. వారణాసి, రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ఇండియా కూటమి మిత్రపక్షాలు 63 స్థానాల్లో పోటీ చేస్తాయి.
కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. అయితే ఆమె మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడామె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment