
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటనపై కాషాయ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తన స్పందన తెలియజేశారు. తాను పార్టీ అంతర్గత సమావేశంలో మాత్రమే.. తన అభిప్రాయం చెప్పగలను అంటూ క్లారిటీ ఇచ్చారు.
కాగా, అరవింద్ ప్రకటనపై మీడియా ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తున్నట్టు విజయశాంతి తెలిపారు. ఇక, విజయశాంతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత ఎవరైనా.. పార్టీ కార్యకర్త లేదా నేతలు.. పార్టీ అధ్యక్షుడి కామెంట్స్‌పై స్పందిస్తే.. అది పార్టీ సమావేశాల్లో జరిగినట్లైతే ఎప్పుడూ కూడా అది అంతర్గత ప్రజాస్వామ్య విధానంగానే పార్టీ పరిగణిస్తుంది. ఆ కామెంట్స్‌ని సమయం, సందర్భం, సమస్య పరిస్థితుల ప్రామాణికతతో విశ్లేషించడం, అవసరమైన నిర్ణయం చెప్పడం కూడా సహజంగా పార్టీ విధానం అని స్పష్టం చేశారు.
ఇక, ఎంపీ అరవింద్ మాట్లాడిన సందర్బం మొత్తం నేను చూడలేదు. కానీ, అందులోని ఏదో ఒక అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న బీఆర్‌ఎస్ అనుకూల వర్గానికి మాత్రం ఒకటి చెప్పగలను. బండి సంజయ్ తన మాటలను వెనక్కి తీసుకోవాల్సి వస్తే.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, బీఆర్‌ఎస్ నాయకులు వారు గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత కామెంట్స్‌ను అనేక సార్లు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని వందల సార్లు వారు ముక్కు నేలకు రాయాల్సి వస్తుందని గుర్తించాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, అంతుకుముందు.. ఎంపీ అరవింద్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై సంచలన కామెంట్స్ చేశారు. కవితపై సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు. అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని సూచించారు.