
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారని, మత కలహాలు సృష్టించి కూలదోస్తామని చెబుతున్నట్టా అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఎప్పటికీ కలిసే ఉంటాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత అవసరమైతే పొత్తు పెట్టుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక, బిహార్‌లో కాంగ్రెస్–ఆర్జేడీలాంటి బలమైన కూటమిని ఓడగొడితే దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవదనే అభిప్రాయం మైనార్టీల్లో కలిగించాలనే వ్యూహంతోనే టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. తద్వారా అనేక రాష్ట్రాల్లో పట్టు సాధించి పొత్తుల ద్వారా విస్తరించేందుకు అవసరమైన నిధులను కూడా ఎంఐఎంకు టీఆర్‌ఎస్ అందించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందని వెల్లడించారు.