గ్రేటర్‌ పోరు: కౌన్‌ బనేగా? | GHMC Elections 2020: Division Wise Chances Of Winning Candidates | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ పోరు: కౌన్‌ బనేగా?

Published Mon, Nov 30 2020 8:40 AM | Last Updated on Mon, Nov 30 2020 8:54 AM

GHMC Elections 2020: Division Wise Chances Of  Winning Candidates - Sakshi

గ్రేటర్‌ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం ముగిసింది. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే నువ్వా నేనా..? అనేలా పోటీ ఉండగా.. అక్కడక్కడా కాంగ్రెస్‌ పోటీ ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అభివృద్ధి పథకాలు, సిట్టింగ్‌లు, క్యాడర్‌  టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా  ఉండగా.. వరదలు, రూ.10 వేల ఆరి్థక సాయం, దుబ్బాక ఓటమి  బీజేపీకి కలిసొచ్చే అంశాలు.  పాతబస్తీలో అత్యధిక స్థానాలు మజ్లిస్‌ పార్టీలకే అనుకూలంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సెటిలర్లు, ఉత్తర భారతీయులు, ముస్లిం మైనార్టీ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపినా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది.  

కూకట్‌పల్లి నియోజకవర్గంలో.. 
కూకట్‌పల్లి:  కూకట్‌పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నాయి. గతంలో కేపీహెచ్‌బీ డివిజన్‌ మినహా మిగిలిన అన్ని డివిజన్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. కేపీహెచ్‌బీలో టీడీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. మూసాపేటలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్,  కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు మూసాపేట ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. మోతీనగర్‌ ప్రాంతంలో కొంత భాగంలో ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే కనిపిస్తోంది. అభివృద్ధి టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. కేపీహెచ్‌బీ కాలనీలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీకి హోరాహోరీ పోరు నడుస్తోంది. వలస ప్రాంతీయులు ఎక్కువగా ఉన్న ఈ డివిజన్‌లో పోటీ నువ్వా నేనా..? అన్న విధంగా ఉంది.

సెటిలర్స్‌ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బాలాజీనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ  ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజకీయ అనుభవజ్ఞుడు కావటం బీజేపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడంతో కొంత తేడా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోంది. అల్లాపూర్‌లో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా ఉండటంతో టీఆర్‌ఎస్‌కు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది.ఫతేనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీకి హోరాహోరిగా ఉన్నప్పటికీ బీజేపీకి రెబల్‌ అభ్యర్థి, టీఆర్‌ఎస్‌కు ముస్లింఅభ్యర్థితో కొంత ఇబ్బంది నెలకొంది. దీంతో ఇరుపార్టీల అభ్యర్థులకు కూడా తలనొప్పిగా మారింది. బోయిన్‌పల్లిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ ఉంది. బాలానగర్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు కొత్త వారు కావడంతో ఓటర్లు ఎవరికి తీర్పు ఇచ్చేదో ఉత్కంఠగా ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి గతంలో పోటీ చేయడంతో ఆయనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.కూకట్‌పల్లి డివిజన్‌లో త్రిముఖ పోటీ ఉంది. అధికార పార్టీ తాను చేసిన అభివృద్ధి పనులతో ముందుకు పోతుండగా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. ఇక్కడ ముగ్గురు ఒకే సామాజికవర్గం కావటంతో ఓటర్లు  ఎవరికి తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే.  

శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో.. 
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో ఏడు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. ఓవరాల్‌గా ఎక్కువ స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. నార్త్‌ ఇండియన్స్‌  పోలింగ్‌లో పాల్గొంటేనే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుంది. కొండాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి షేక్‌ హమీద్‌ పటేల్, బీజేపీ అభ్యర్థి రఘునాథ్‌ యాదవ్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. నార్త్‌ ఇండియన్‌ ఓట్లు ఎక్కువగా పోలైతే టీఆర్‌ఎస్‌కు మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. గచ్చిబౌలి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబ, బీజేపీ అభ్యర్థి గంగాధర్‌రెడ్డి మధ్య పోటీ  ఉంది. మైనార్టీ ఓట్లతో పాటు నార్త్‌ ఇండియన్‌ ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికీ టీఆర్‌ఎస్‌కే ఎడ్జ్‌ ఉంది.

 శేరిలింగంపల్లి డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగం నాగేందర్‌ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఎల్లేష్‌ మధ్య పోటీ ఉంది.  మాదాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్‌ మధ్య పోటీ  ఉంది. మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. మియాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్, బీజేపీ అభ్యర్థి రాఘవేందర్‌రావు మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లు కీలకం. హఫీజ్‌పేట్‌ డివిజన్‌లో పూజితా జగదీశ్వర్‌గౌడ్, అనూష మహేష్‌ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది.  చందానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంజుల, బీజేపీ అభ్యర్థి సింధూ మధ్య పోటీ ఉంది.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో..
బంజారాహిల్స్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు బంజారాహిల్స్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తొలిరోజు నుంచే ప్రచారంలో ఉన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, మహమూద్‌ అలీలు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీతక్క ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్‌ ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వరకాలనీలో టీఆర్‌ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక్కడ వార్‌ వన్‌సైడ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ కాంగెస్‌ అభ్యర్థి యువకుడు కావడంతో కొంత వరకు ఓట్లు చీలే అవకాశం ఉంది. బస్తీల్లో టీఆర్‌ఎస్‌కు  ధీటుగా బీజేపీ బలంగానే ఉంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది.  ఖైరతాబాద్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ చాపకింద నీరులా కొంత విస్తరిస్తోంది. ముఖ్యంగా యువత బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ నడుస్తోంది.  

సోమాజిగూడ డివిజన్‌ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ రెండు నియోజకవర్గాల మధ్యలో ఉంది. దీంతో ఇక్కడ ఒక వైపు ముస్లింలు, మరో వైపు హిందువులు ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌ ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్లుగా పోరు సాగుతోంది. అత్యధికంగా వ్యాపారులు, కాలనీలు, ఉన్నత విద్యావంతులు ఉండటంతో వారు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మోండాలో పోటీ ఆ ఇద్దరి మధ్యే.. 
కంటోన్మెంట్‌:  మోండా (డివిజన్‌ 150)లో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌(ఆకుల రూప), బీజేపీ(కొంతం దీపిక), కాంగ్రెస్‌(బాల ప్రశాంతి) బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంది. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. ప్రచారంలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే సాయన్న తన కూతురు లాస్యనందిత పోటీ చేస్తున్న ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్‌లో ప్రచారానికే పరిమతం అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తరఫున ఇన్‌చార్జి ముధోల్‌ ఎమ్మెల్యే, కొందరు స్థానిక నేతలు మినహా పార్టీ పెద్దలు ఎవరూ ఇక్కడ ప్రచారం చేయలేదు. బీజేపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త అయినా కొందరు స్వచ్ఛందంగా ఆమెకు ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారు.

మలక్‌పేట నియోజకవర్గం 
మలక్‌పేట: నియోజకవర్గ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి.  మూసారంబాగ్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది.  సైదాబాద్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండగా మైనార్టీ ఓట్లు ఎక్కువగా పోలైతే టీఆర్‌ఎస్‌ అనుకూలం. మిగిలిన నాలుగు డివిజన్లు ఓల్డ్‌మలక్‌పేట, చవుని, ఆజంపుర, అక్బర్‌బాగ్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు సునాయసమే. సైదాబాద్, మూసారంబాగ్‌లలో టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే బలాల ప్రచారం చేశారు. యాకత్‌పుర నియోజకవర్గం ఐఎస్‌సదన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది.  కుర్మగూడ డివిజన్‌లో ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంది.  మహేశ్వరం నియోజకవర్గం.. ఆర్‌కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.   

సనత్‌నగర్‌ నియోజకవర్గం 
సనత్‌నగర్‌:  నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేటలతో పాటు మోండా(పార్ట్‌) డివిజన్లు విస్తరించి ఉన్నాయి. సనత్‌నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ డివిజన్‌లో సెటిలర్స్‌ ఓటు బ్యాంక్‌ కీలకం.  అమీర్‌పేట డివిజన్‌కు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌–బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నార్త్‌ ఇండియన్స్‌ ఓటు బ్యాంకుపై తమకే అన్న ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు.  

బేగంపేట డివిజన్‌లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం కొనసాగించారు. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఇన్‌ఛార్జి రేఖానాయక్‌ ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు.  రాంగోపాల్‌పేట డివిజన్‌ నుంచి కూడా టీఆర్‌ఎస్, బీజేపీలు నువ్వా–నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీ ఉత్తర భారతీయుల మద్దతు లభిస్తుండటంతో ఆ పార్టీ జోష్‌లో ఉంది. బన్సీలాల్‌పేట డివిజన్‌లో బస్తీలు ఎక్కువగా ఉండటంతో కొన్ని హామీలు నెరవేర్చడంతో టీఆర్‌ఎస్‌ అభ్యరి్థని గట్టెక్కిస్తాయనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.   

గోషామహల్‌ నియోజకవర్గంలో.. 
అబిడ్స్‌: గోషామహల్‌ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లు ఉన్నాయి. బేగంబజార్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థి విజి.పురుషోత్తమ్‌ టీఆర్‌ఎస్‌  అభ్యర్థి పూజ వ్యాస్‌ బిలాల్‌కు మద్దతు ప్రకటించడంతో పోటీ పెరిగింది. గోషామహాల్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య బిగ్‌ ఫైట్‌ నెలకొంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఖేష్‌ సింగ్, బీజేపీ నుంచి  సీనియర్‌ బీజేపీ నేత లాల్‌సింగ్‌ పోటీలో ఉన్నారు. జాంబాగ్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ. టీఆర్‌ఎస్‌ గత ఎన్నికల్లో కేవలం 5 ఓట్లతో  ఓడిపోయింది. ఆ సింపతి కలిసొచ్చే అవకాశం ఉంది.  గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. ఎల్బీస్టేడియంలోని కేసీఆర్‌ బహిరంగ సభ గన్‌ఫౌడ్రీ డివిజన్‌లోనే ఉండటం టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం పెరిగింది. మంగళ్‌హాట్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ. దత్తాత్రేయనగర్‌ డివిజన్‌లో మజ్లిస్‌ అభ్యర్థి జకీర్‌ బాక్రే, బీజేపీ అభ్యర్థి ధర్మేందర్‌ సింగ్‌లు బలంగా ఉన్నారు. ఇక్కడ 70 శాతం మైనార్టీ ఓట్లు ఉన్నాయి.

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో.. 
సికింద్రాబాద్‌: నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. తార్నాకలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మోతె శ్రీలతారెడ్డి, బీజేపీ అభ్యర్థి బండ జయసుధరెడ్డి మధ్యే పోటీ.. బౌద్ధనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంది శైలజ, బీజేపీ అభ్యర్థి మేకల కీర్తి మధ్య పోటీ ఉంది. ఐదు డివిజన్లలో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. బస్తీల ఓట్లు కీలకంగా మారనున్నాయి.

సీతాఫల్‌మండి, తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో రైల్వే కాలనీల్లో రైల్వే కుటుంబాలకు చెందిన వేలాది ఓట్లు ఉన్నాయి. రైల్వే కుటుంబాలు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో వీరి ప్రభావం లేకుండాపోయింది. కేటీఆర్‌ రోడ్‌ షోతో ఐదు డివిజన్లు తమవేనని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తుండగా, అమిత్‌ షా రోడ్‌షో ద్వారా తమకు 3 డివిజన్లు దక్కడం ఖాయమన్న ధీమాను బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.  బౌద్ధనగర్, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల నుంచి టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు అందరూ కొత్తవారిని రంగంలోకి దింపాయి.  

కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో.. 
కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం ఎనిమిది డివిజన్లు ఉండగా ప్రధాన పారీ్టల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. కొన్నిచోట్ల ద్విముఖ పోటీ నెలకొనగా, మరికొన్ని డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకటి, రెండు డివిజన్లలో ఏకపక్షంగా అభ్యర్థులు గెలిచే అవకాశముంది. గాజులరామారం డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రావుల శేషగిరి మధ్య గట్టి పోటీ ఉంది.  జగద్గిరిగుట్ట డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జగన్, బీజేపీ అభ్యర్థి మహేశ్‌ యాదవ్‌ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది.  చింతల్‌ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కొట్టె రాధిక, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీదాబేగం మధ్య పోటీ నెలకొంది.  

సూరారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి సత్యనారాయణకు కాంగ్రెస్‌ అభ్యర్థి బట్ట పాలవెంకటేశ్‌ పోటీ ఇస్తున్నారు. సుభాష్‌నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హేమలతకు అనుకూలంగా ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోతున్నారు. జీడిమెట్ల డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాప్రతాప్, బీజేపీ అభ్యర్థి తారా చంద్రారెడ్డి మధ్య పోటీ ఉంది.  కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గౌరీష్‌ పారిజాత, బీజేపీ అభ్యర్థి గడ్డం సాత్విక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. 

అంబర్‌పేట నియోజకవర్గంలో 
అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ మూడు డివిజన్లలో ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ప్రచారం చేస్తోంది.  కాచిగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ కార్పొరేటర్‌ రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉండటంతో బీజేపీ కాస్త అనుకూలంగా మారినా పోటీ తీవ్రంగానే ఉంది.నల్లకుంట డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. కాంగ్రెస్‌ బలమైన పోటీ ఇవ్వనుంది. గోల్నాక డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ. గెలుపు అవకాశం టీఆర్‌ఎస్‌కే ఉన్నా సైలెంట్‌ ఓటింగ్‌ 
జరిగితే బీజేపీకి అవకాశం ఉంది. అంబర్‌పేట డివిజన్‌లో త్రిముఖ పోటీ ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా పోరాడుతున్నాయి. బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యరి్థకి రెబల్‌ బెడద ఉంది.

మెహిదీపట్నంలో.. 
గోల్కొండ: మెహిదీపట్నంలో కార్వాన్‌ నియోజకవర్గానికి చెందిన ఆరు డివిజన్లు ఉన్నాయి. గతంలో జియాగూడ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ గెలవగా.. కార్వాన్, లంగర్‌హౌస్, టోలిచౌకి, గోల్కొండ, నానల్‌నగర్‌ డివిజన్లలో మజ్లిస్‌ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో బీజేపీ, మజ్లిస్‌మధ్య పోటీ ఉంది. టోలిచౌకి, గోల్కొండ, నానల్‌నగర్‌లలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు ముందున్నారు.

ఉప్పల్‌ నియోజకవర్గంలో..
ఉప్పల్‌: ఉప్పల్‌ నియోజకవర్గంలో పది డివిజన్లు ఉన్నాయి. కాప్రా డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం కోసం కష్టపడుతున్నా.. అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ అధికంగా ఉంది. ఎవరికి రెండో స్థానమో సందిగ్ధం నెలకొంది.  ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఉంది.  చర్లపల్లి డివిజన్‌లో గతంలో గెలిచి మేయర్‌ అయిన బొంతు రామ్మోహన్‌ భార్య ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్నారు. రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు.  

మీర్‌పేట–హెచ్‌బీకాలనీ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంది.  మల్లాపూర్‌ డివిజన్‌లోటీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవేందర్‌రెడ్డికి వ్యతిరేకత ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు అనుకూలం.   నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.   చిలుకానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా.. నేనా? అనే అన్నట్లుగా పోటీ ఉంది. హబ్సిగూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య బిగ్‌ ఫైట్‌ నడుస్తోంది. రామంతాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  ఉప్పల్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంది.   

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో.. 

ముషీరాబాద్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. ఐదు డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. భోలక్‌పూర్‌ డివిజన్‌లో మాత్రం ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్‌ మైనారీ్టలు అధికంగా ఉన్నారు. వీరు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు కూడా సరైనవారికి ఇవ్వకపోవడంతో బీజేపీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పారీ్టకి మరింత బలాన్ని చేకూర్చింది. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ టికెట్‌ కేటాయించడంతో వారిమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. కొంతమంది టికెట్‌ ఆశించిన నేతలు అభ్యర్థుల విజయం కోసం పనిచేయడంలేదు. కాంగ్రెస్‌ నామమాత్రపు అభ్యర్థులకు టికెట్లను కేటాయించి ప్రచారంలో వెనుకపడటంతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ టీఆర్‌ఎస్‌కా.. బీజేపీకా..? వేచి చూడాల్సిందే..

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో 
రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఐదు డివిజన్లు ఉన్నాయి. శాస్త్రీపురం, సులేమాన్‌నగర్‌ డివిజన్లలో మజ్లిస్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. సులేమాన్‌నగర్, శాస్త్రీపురంలో మజ్లిస్‌కు అనుకూలంగా ఉంది. అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనేలా పోటీ ఉంది. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ బీజేపీలో చేరి పోటీ చేస్తున్నాడు. టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్‌ సోదరుడు ప్రేమ్‌దాస్‌గౌడ్‌ పోటీలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోటీ ఉంది. అత్తాపూర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీతో గట్టిపోటీ ఉంది.  

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో..
ఎల్‌బీనగర్‌:  ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉంది. అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా..? అనే రీతిలో ప్రచారంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. చైతన్యపురి, నాగోల్,మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, చంపాపేట్, కొత్తపేట డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. హస్తినాపురంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. లింగోజిగూడలో మూడు పారీ్టల మధ్య పోటీ ఉంది.

గడ్డిఅన్నారంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంది. హస్తినాపురం, చంపాపేట, కొత్తపేట, నాగోల్, హయత్‌నగర్, మన్సూరాబాద్‌ డివిజన్లలో బస్తీలకు చెందిన ఓటర్లు కీలకం కాగా, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి,  గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్‌లలో ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. 11 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌కార్పొరేటర్లే అభ్యర్థులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సఫలం కాకపోవడంతో ప్రత్యర్థులకు  కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 
జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్‌గూడ టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. సిట్టింగ్‌ సంజయ్‌గౌడ్‌కు టికెట్‌ ఇవ్వకుండా రాజ్‌కుమార్‌పటేల్‌కు టికెట్‌ ఇవ్వడంతో సంజయ్‌గౌడ్‌ వర్గం చాపకిందనీరులా వ్యతిరేకంగా పనిచేస్తోంది. బీజేపీ అభ్యర్థి కుంభాల గంగరాజు పుంజుకున్నాడు. అవకాశాలు చెరి సగం ఉన్నాయి.  వెంగళరావునగర్‌ సిట్టింగ్‌ కిలారి మనోహర్‌కు టికెట్‌ నిరాకరించడంతో బీజేపీ నుంచి బరిలో దిగారు. కమ్మ కులం మద్దతు ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేదిప్య రాజకీయాలకు కొత్త కావడం కొంత ఇబ్బందికరంగా మారింది.  ఎర్రగడ్డలో ఎంఐఎం సిట్టింగ్‌ షాహిన్‌బేగం ఉన్నారు. ముస్లింల మెజార్టీ ఉండటంతో ఎంఐఎంకు అనుకూలంగా ఉండే అవకాశం.  రహమత్‌నగర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి.  బోరబండ టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ బాబా ఫసియుద్దీన్‌ పట్ల వ్యతిరేకత ఇబ్బందిగా ఉంది. సైట్‌ 3లో పట్టుకోల్పోతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంది.  

పాతబస్తీలో మజ్లిస్‌ హవా 
చార్మినార్‌:  మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా నిలిచిన పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు సత్తా చాటనున్నారు. చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 24 డివిజన్లలో మజ్లిస్‌ పార్టీ అభ్యర్థులు మొదటి స్థానంలో ఉండగా.. పోటీనిచ్చే స్థానంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులున్నారు.  

మల్కాజిగిరిలో.. మల్కాజిగిరి డివిజన్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ నుంచి అభ్యర్థి జగదీష్‌గౌడ్‌ రెండవసారి పోటీ చేస్తుండగా.. బీజేపీ అభ్యర్థి వూరపల్లి శ్రవణ్‌ మొదటిసారి పోటీలో ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లో త్రిముఖ పోటీ ఉండే అవకాశముంది. మాజీ కార్పొరేటర్‌ ప్రేమ్‌కుమార్‌ మరోమారు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బక్కా నాగరాజు డివిజన్‌ పరిధిలోని నాయకుడు కానప్పటికీ స్వచ్ఛ భారత్‌ కనీ్వనర్‌గా గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఉమేష్‌సింగ్‌ సీనియర్‌ లీడర్, స్థానికంగా గుర్తింపు ఉండటం ఆయనకు కలిసివచ్చింది. ఇక్కడ పోటీ నువ్వా.. నేనా? అన్నట్లు ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement