సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు.
సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
జిల్లాలో నువ్వా నేనా?
ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు సీటు తమదంటే తమదంటూ పోటీపడుతూ గొడవలకు దిగడంతో జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఉదా.. అనకాపల్లి ఎంపీ సీటు కోసం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తుండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. తన కొడుక్కి ఎంపీ సీటు నిరాకరిస్తుండడంతో అయ్యన్న కస్సుమంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
రాజమండ్రి రూరల్‌లో రాజుకున్న విభేదాలు..
ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రాజేసింది. అక్కడి నుంచి మళ్లీ తానే పోటీచేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా సీటు తనదేనని జనసేన నేత కందుల దుర్గేష్ తొడకొడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఇప్పటికే బహిరంగంగా గొడవలు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా.. బుచ్చయ్య చౌదరి స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సీటును ఆపడానికి దుర్గేష్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై దుర్గేష్ వర్గం మండిపడుతూ ప్రతి విమర్శలు చేసింది. ఇలా.. నిత్యం రెండు పార్టీల నేతలు సీటు కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు.
పిఠాపురంలో పోటాపోటీ..
► కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్‌ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సీటు తనదేనని చెబుతూ ఒకసారి ఓడిపోయిన వారికి సీటు ఎలా ఇస్తారని వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి ప్రతిగా పార్టీ అధినేతలే ఓడిపోయిన పరిస్థితి ఉందంటూ పవన్ విషయాన్ని వర్మ గుర్తుచేశారు. దీంతో గొడవ జరిగి ఇరు వర్గాలు కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది.
► అలాగే, కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కారాలు నూరుతున్నారు. సీటు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
► అమలాపురం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు.
► రాజోలు సీటును పవన్ తమదేనని ప్రకటించినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తున్నారు.
► ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరం సీటు జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.
► నర్సాపురం సీటు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
► అలాగే, కృష్ణా జిల్లాలోనూ రెండు, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీచేస్తున్నట్లు జనసేన నేత పోతిన మహేష్ హడావుడి చేస్తుండగా టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్నలు అతనికి అంత సీన్‌లేదని ఎద్దేవా చేస్తున్నారు.
తెనాలిపై మనోహర్, రాజా పట్టు..
ఇక తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీపడుతుండడం రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేయగా, రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూ తానే పోటీచేస్తానని చెబుతున్నారు. రాజాకు సీటు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో రాజా అనుచరులు తొడలు కొడుతున్నారు.
► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు తమదేనని జనసేన నేతలు ప్రకటించుకోవడంతో అక్కడి టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడుతున్నారు.
► అనంతపురం అర్బన్ సీటు కోసం రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు.
► ధర్మవరం సీటుపైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
సీఎం సీటుపైనా సిగపట్లు..
ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్‌కళ్యాణ్ బలపరుస్తున్నా ఆ పార్టీ నేతలు, కేడర్ మాత్రం అంగీకరించడంలేదు. పైగా పవనే సీఎం అభ్యర్థని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్‌లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment