రాహుల్ గాంధీ ఏ సీటు వదులుకుంటారు?.. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ ఇదే. కేరళ వయనాడ్‌తో పాటు కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారాయన. అయితే టెక్నికల్‌గా ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన దేని వదులుకుంటారు? దేనికి పరిమితం అవుతారు? అనే ఆసక్తి నెలకొంది.
గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అనూహ్యంగా అమేథీ నుంచి ఓడి, వయనాడ్ నుంచి నెగ్గారు. ఈసారి కూడా తొలుత అక్కడి నుంచే పోటీ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ బలంగా ఉండటంతోపాటు.. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేశాయి. ఇక బీజేపీ, వామపక్ష పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఏకంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ పోటీ దిగారు. ఉత్తర భారతానికి చెందిన రాహుల్ అసలు వయనాడ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అయినా కూడా వయనాడ్ నుంచి రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు.
ఇక.. రాయ్‌బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ, సోనియాగాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్.. భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాహుల్ రాయ్‌బరేలీని వదులుకుంటే అక్కడ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదనే వాదనా ఉంది.
అయితే ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ మాత్రం ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని ఒక మాటైతే అన్నారు. దీంతో అది రాయ్‌బరేలీ కావొచ్చనే ఊహాగానాలు తెర మీదకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment