What is MLC Elections ?, How MLC is Elected and What is Qualification?- Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ విషయాలు తెలుసా?

Published Thu, Mar 11 2021 4:03 PM | Last Updated on Thu, Apr 14 2022 1:01 PM

What is MLC Elections, How is Elected and What is Qualification - Sakshi

ప్రస్తుతం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో కొత్తగా ఎంతోమంది ఓటర్లుగా నమోదయ్యారు. గట్టిపోటీ నెలకొన్నందువల్ల రెండో ప్రాధాన్యత ఓటు కీలకమవుతుందనే అంచనాలున్నాయి. కాబట్టి ఓటు ఎలా వేయాలి, ప్రాధాన్యతలను ఎలా ఇచ్చుకుంటూ వెళ్లాలి, కౌంటింగ్‌ ప్రక్రియ ఎలా ఉంటుందనేది తెలియాలి. ఓటర్ల అవగాహన కోసం ఆ వివరాలు క్లుప్తంగా.... 

1. బ్యాలెట్‌ పేపర్‌పై అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. రాజకీయ పార్టీల తరఫున పోటీచేస్తున్నా... వారి పేర్ల పక్కన పార్టీ గుర్తులు ఉండవు. పార్టీల అభ్యర్థులు గెలిస్తే వారికిచ్చే ధ్రువపత్రంలో ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది రాస్తారు. 

2. ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. తాము ఎవరికైతే ఓటు వేయదలచుకున్నారో వారి పేరు పక్కన ఉన్న గడిలో 1 అంకె వేయాలి. టిక్‌ చేయకూడదు. అలాగే ఇతరత్రా మరే పద్ధతిలోనూ ఓటును మార్క్‌ చేసినా అది చెల్లదు. అంకె (నెంబర్‌) మాత్రమే వేయాలి. అక్షరాల్లో రాసినా ఓటు చెల్లకుండా పోతుంది.  

3. పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉంటే...  ఓటరు అన్ని ప్రాధాన్యత ఓట్లు వేయవచ్చు అంటే ఉదాహరణకు ఈసారి హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి తమ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు... అంటే 1, 2, 3, 4.... ఇలా అభ్యర్థుల పేర్ల పక్కన తాము వారికిచ్చే ప్రాధాన్యతను అంకె రూపంలో వేయవచ్చు. అలా 93 వరకూ ప్రాధాన్యత ఇవ్వొచ్చు.  

4. మొదటి ప్రాధాన్యత (నంబర్‌ 1) ఇవ్వకుండా... మీరెన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా ఆ ఓటు చెల్లదు. 

5. ఒక్కరికే తొలి ప్రాధాన్యత ఓటు వేసి ఆపేయవచ్చు లేదా తాము ఎన్ని అనుకుంటే అన్ని పాధాన్యత ఓట్లు వేసి (ఉ దాహరణకు 10 వరకు మాత్రమే వేసి) ఆపేయవ చ్చు. అయితే ప్రాధ్యానతను ఇచ్చే క్రమంలో వరుస తప్పకూడదు. ఉదాహరణకు మొదటి ప్రాధాన్యతకు 1 ఇచ్చి తర్వాత క్రమం తప్పి 3, 4, 5 వేస్తూ పోయారనుకోండి... అప్పుడు ద్వితీయ ప్రాధాన్య త ఓట్లను లెక్కించాల్సిన అవసరం వస్తే మీ ఓటు చెల్లదు. మొదటి ప్రాధాన్యత వరకే మీ ఓటు ను పరిగణనలోని తీసుకొని... తర్వాత పక్కన పెట్టేస్తారు. 

6. ఒకే నంబరును ఇద్దరు అభ్యర్థులకు ఇచ్చినా...ఓటు చెల్లకుండా పోతుంది.  

7. బ్యాలెట్‌ పేపరుపై అంకెలు వేయడానికి పోలింగ్‌ స్టేషన్‌లో ఇచ్చే స్కెచ్‌ పెన్‌నే వాడాలి.  

8.బ్యాలెట్‌ పేపర్‌పై పేర్లు రాయడం, సంతకం చేయడం, వేలిముద్ర వేయడం... చేయకూడదు. అంకెలతో ఓటు ను మార్క్‌ చేయడం తప్పితే బ్యాలెట్‌పై  ఏం రాసినా... దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు. 

9. విధి నిర్వహణలో భాగంగా ఇతర ప్రదేశా ల్లో ఉంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కూడా ఓటు వేయవచ్చు. దీనికి నిర్ణీ పద్ధతి ఉంటుంది. అదీకృత అధికారి అటెస్టేషన్‌ అవసరం.  

1. విజేతను తేల్చడానికి ఒక ఫార్ములాను అనుసరిస్తారు అయితే టెక్నికల్‌గా కాకుండా స్థూలంగా చెప్పాలంటే... పోలైన వాటిలో చెల్లుబాట్లయ్యే ఓట్లలో 50 శాతం + ఒక ఓటు రావాలి. ఉదాహరణకు 3,60,020 ఓట్లు చెల్లుబాటు అయ్యాయనుకోండి... అందులో సగం 1,80,010 ఓట్లు + 1 రావాలి. కనీసం 1,80,011 మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తే గెలిచినట్లు.  
2. అభ్యర్థులెవరికీ నిర్ణీత తొలి ప్రాధాన్యత ఓట్లు రాకపోతే... అప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం అవుతాయి.  
3. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ముందు పోటీనుంచి తప్పిస్తారు. అతనికి పడ్డ ఒక్కో ఓటును తీసి... అందులో ద్వితీయ ప్రాధాన్యత (నెంబరు 2) ఎవరికి ఉంటే వారికి ఆ ఓటును బదలాయిస్తారు (కలుపుతారు). ఒకవేళ సమాన ఓట్లతో ఆఖరిస్థానంలో ఇద్దరు ఉన్నారనుకోండి... అప్పుడు ఎవరిని ముందు ఎలిమినేట్‌ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు.  
4.ఇలా అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్‌ మొదలవుతుంది. చివరి అభ్యర్థి తర్వాత... అతని పైస్థానంలో ఉండే అభ్యర్థి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కింపునకు తీసుకుంటారు. అంటే కింది నుంచి క్రమంగా పైకి వెళతారు.  
5. మొదటి ప్రాధాన్యత ఓట్లలో మ్యాజిక్‌ మార్క్‌కు సమీప దూరంలో నిలిచిపోయిన అభ్యర్థులకు (అత్యధిక ఓట్లు పొందిన తొలి ఇద్దరు– ముగ్గురు అభ్యర్థులు) ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల బదలాయింపు జరిగితే వారి ఓట్ల సంఖ్య పెరుగుతుంది. అలా విజయానికి చేరువవుతారు. ఎవరైనా ఒకరికి నిర్ణీత ఓట్లు (50 శాతం + ఒక ఓటు) వచ్చే దాకా ఈ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది (ఒకరు నిర్ణీత ఓట్లను సాధించిన వెంటనే కౌంటింగ్‌ ప్రక్రియను నిలిపివేయరు. ఆ రౌండ్‌లో ఎలిమినేట్‌ అవుతున్న అభ్యర్థికి సంబంధించిన మొత్తం ఓట్ల లెక్కింపును పూర్తిచేసి కౌంటింగ్‌ను నిలిపివేస్తారు). రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా కలుపుకొని మ్యాజిక్‌ మార్క్‌కు చేరుకున్న వారిని విజేతగా ప్రకటిస్తారు. 
– సాక్షి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement