పశ్చిమ యూపీలో ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, ప్రచారం చేపట్టే విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కనిపించడం లేదు. తొలి విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. అయితే ప్రచారం చివరి రోజున ఇరు పార్టీలు ఉమ్మడి ర్యాలీకి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పశ్చిమ యూపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల తీరుకు భిన్నంగా బీజేపీ-ఆర్‌ఎల్‌డీల దోస్తీ పటిష్టంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, హోంమంత్రితో ఆర్‌ఎల్‌డీ చీఫ్ జయంత్ చౌదరి పలుమార్లు సమావేశమయ్యారు. ఇదే సమయంలో ఎస్పీ, కాంగ్రెస్ హైకమాండ్ విడివిడిగా తమ గొంతు వినిపించడం విచిత్రంగా మారింది. ఎస్పీ తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ విడిగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వివిధ లోక్‌సభ స్థానాలకు వెళ్లి తమ కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలేష్ యాదవ్ పిలిభిత్ నుంచి ముజఫర్ నగర్ వరకు బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ముజఫర్‌నగర్‌కు సమీపంలో జరిగిన ప్రియాంక గాంధీ రోడ్ షోలో అఖిలేష్ కనిపించలేదు. సహరాన్‌పూర్ లోక్‌సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు.
ప్రచారం చివరి రోజున ఎస్పీ, కాంగ్రెస్‌లు ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ప్రధాన కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని రాజకీయ విశ్లేషకులు జ్ఞాన్ ప్రకాశ్ తెలిపారు. 2019 నాటి ఎస్‌పీ, బీఎస్‌పీ పొత్తును ఉదహరిస్తూ, అప్పట్లో ఆ రెండు పార్టీల అధినేతలు ఉమ్మడి ర్యాలీని నిర్వహించారన్నారు. అయితే నాడు బహుజన సమాజ్ పార్టీ.. కూటమి వల్ల ప్రయోజనం పొందిందని, ఎస్పీ ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేకపోయిందన్నారు. ఈ సారి ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి ర్యాలీ నిర్వహించకపోవడానికి ఇదే కారణం కావచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment