
సాక్షి, అమరావతి : గ్రామాల్లో డ్రామాలు చేసినట్లుగా టీడీపీ నాయకులు అసెంబ్లీ బయట ర్యాలీలు, బేడీలు వేసుకుని డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు దళితద్రోహి అని, ఎస్సీలను కూలీలుగా చూశారని అన్నారు. ఆయన దళితుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో కైలే అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీల్లో ఎవరు పుడతారన్న వ్యక్తి చంద్రబాబు.. ఎస్సీలు శుభ్రంగా ఉండరన్న నాయకులు టీడీపీ నాయకులు.. కళ్యాణి అనే ఆర్ అండ్ బీ ఉద్యోగిని కాలుతో తన్నిన వ్యక్తి అచ్చెన్నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలతో ఎక్కువగా దళితులే లబ్ది పొందుతున్నారన్నారు. సీఎం జగన్.. జన్మభూమి కమిటీల్లాగా ప్రజలను బానిసలు చేయలేదని, వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి సంక్షేమ పథకాలు పేదల గడప వద్దకే చేర్చారని అన్నారు. ( ఏపీ అసెంబ్లీ: కీలక బిల్లుల ఆమోదం )
సీఎం జగన్ దళితులను పారిశ్రామిక వేత్తలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ నవశకం పథకానికి శ్రీకారం చుట్టారని, ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం చట్టం తెచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో దళారులు, బ్రోకర్లు మాత్రమే లబ్ది పొందారని, బాబు దళిత పక్ష పతి అయితే టీడీపీలో ఒక్క దళిత శాసనసభ్యడు మాత్రమే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 22 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment