సాక్షి,అమరావతి: రాష్ట్రంలో రహదారుల దుస్థితికి చంద్రబాబు సర్కారు నిర్వాకాలే కారణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. గత సర్కారు చివరి రెండేళ్ల పాటు రహదారుల నిర్వహణ, మరమ్మతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా రోడ్ల గురించి పట్టించుకోకుండా నాసిరకం పనులతో సరిపుచ్చి ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు టీడీపీ నేతలు ఆర్టీఐ సమాచారం అంటూ మభ్యపుచ్చే యత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తి
టీడీపీ హయాంలో ఐదేళ్లలో కొత్తగా 1,356 కి.మీ తారు రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగింది. ఏటా సగటున 271.2 కి.మీ. రోడ్లు వేశారు. రహదారుల విస్తరణ, మరమ్మతులు 8,917 కి.మీ చేసినట్లు చెబుతున్నారు. అంటే ఏటా సగటున 1,783 కి.మీ మాత్రమే పనులు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలోనే కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 1,883 కి.మీ తారు (బీటీ) రోడ్ల నిర్మాణం జరిగింది. ఏటా సగటున దాదాపు 942 కి.మీ కొత్త రహదారులు నిర్మించాం. దీంతోపాటు రెండేళ్లలోనే 4,015 కి.మీ మేర రహదారుల విస్తరణ, అభివృద్ధి, మరమ్మతులు జరిగాయి.
ఏటా సగటున 2 వేల కి.మీ పైగా రహదారుల అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ హయాంలో జరిగాయి. మరోవైపు రూ.7,828 కోట్లతో 9,557 కి.మీ. రహదారులకు సంబంధించిన పనులు మంజూరు చేసి చేపట్టబోతున్నాం. టెండర్ల ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. వర్షాకాలంలో పనులు ప్రారంభిస్తే నాణ్యత దెబ్బ తింటుందనే ఉద్దేశంతో తగ్గుముఖం పట్టగానే ప్రారంభించాలని నిర్ణయించాం. చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో రాష్ట్రం అల్లాడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సకాలంలో వర్షాలతో జలాశయాలు కళకళలాడుతున్నాయి. వర్షాల కారణంగా కొన్నిచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కరోనా వల్ల మరమ్మతుల పనులు కొంత నిదానంగా జరుగుతున్నాయి.
పెద్దిరెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేతలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన స్థాయి గురించి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ సీఎంలను ఎవరిని అడిగినా చెబుతారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టి సీఎంలను సైతం ఢీకొట్టి ఎదుర్కొన్న మొనగాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ, అర్హతగానీ టీడీపీ నేతల్లో ఎవరికీ లేదు. చంద్రబాబు, లోకేశ్ మంచి పనులు చేస్తే ఆ పార్టీ 23 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? ఏ ఒక్క హామీని అమలు చేయలేదు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment