సాక్షి, తాడేపల్లి: అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసైన్డ్ రైతుల పట్ల చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారన్నారు.
‘‘అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదని కోర్టుకు వెళ్లారు.. అమరావతిలో అందరూ ఉండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించింది. చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?. పేదలంటే తెలుగుదేశానికి ఎందుకంత కడుపుమంట. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా?’’ అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు.
‘‘జీవో45ని సమర్థిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషిస్తున్నాం. అమరావతిలో 50వేల పైచిలుకు ప్లాట్లు ఇచ్చేలా జగన్ నిర్ణయానికి అడ్డుపడ్డారు. టీడీపీ నేతల చెంప చెల్లుమనిపించేలా తీర్పు వచ్చింది. చంద్రబాబు అసైన్డ్ భూముల్ని స్మశానల పక్క, వాగులో, వంకల్లో ఇచ్చారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని సైతం వరదల్లో మునిగిపోయే ప్రాంతంలో పెట్టాలని చూశారు. సీఎం జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున పెట్టారు. సీఎం జగన్‌కి కావాల్సింది ప్రజా రాజధాని.. రియల్ ఎస్టేట్ రాజధాని కాదు’’ అని నందిగం సురేష్ అన్నారు.
చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం!
‘‘అమరావతిలో పేదలు, దళితులు, బీసీలు ఉంటే మురికి కూపంగా మారుతుందని అభివృద్ధి జరగదంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పుతోనైనా చంద్రబాబు మారాలి. పేదల పట్ల ఇంత వివక్ష సరికాదు. రాష్ట్రంలోని పేదలపాలిట దరిద్రం చంద్రబాబు. ఆయనను రాష్ట్రంలోని పేదలంతా తరిమికొడతారు. టీడీపీ వస్తే అమరావతి నుండి పేదలను బయటకు పంపిస్తామని అచ్చెన్నాయుడు మాట్లాడటం సరికాదు. టీడీపీలోని దళితనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు.
చంద్రబాబుకు, జగన్‌కు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రం మొత్తం బాగుండాలని జగన్ అనుకుంటే, తన సామాజిక వర్గం మాత్రమే బాగుండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దేవుడే ప్రత్యక్షమై మారమని చెప్పినా చంద్రబాబు మారడు. అణగారిన జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు.
చదవండి: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే: మంత్రి కాకాణి
Comments
Please login to add a commentAdd a comment