సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్‌సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేసినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తల దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.
కాగా, వైస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాడుల విషయమై రాష్ట్రపతికి, గవర్నర్‌కు, హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు చేశాం. ఈ దాడులపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు ఫిర్యాదు చేశాం’ అని చెప్పారు.
ఇక, అంతకుముందు.. అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.
బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment