
ప్రకాశం: వేప చెట్టుకు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముండ్లమూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ముండ్లమూరుకు చెందిన షేక్ కాలేషా, మహబూబి దంపతుల రెండో కుమార్తె నూర్ అప్సర అలియాస్ బుజ్జి (27) తండ్రి ఆమె చిన్నతనంలోనే మృతి చెందాడు. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడు కాలింత కిరణ్‌కుమార్‌ను ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంది. కొంతకాలానికి తల్లి కూడా మరణించింది. కొన్నేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కిరణ్‌కుమార్ అద్దంకిలోని బంగ్లా రోడ్లో ఫొటోస్టూడియో నిర్వహిస్తున్నాడు. నూర్‌అప్సర ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తోంది.
ఇటీవల దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో నూర్‌అప్సరను కిరణ్‌కుమార్ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. మనస్తాపం చెందిన నూర్ అప్సర ఆదివారం ఉదయం వేలమూరిపాడు నుంచి ముండ్లమూరు వచ్చింది. పిల్లలు తొమ్మిదేళ్ల నిషిత, ఏడేళ్ల సంగీత ఏడుస్తూ వెంటపడినా పట్టించుకోకుండా వారిని అక్కడే వదిలేసి వచ్చింది. ముండ్లమూరులోని తమ ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు అట్లతద్దె సమయంలో ఏర్పాటు చేసిన ఊయల తాడుకు ఉరేసుకునేందుకు సిద్ధమైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఎస్సీకాలనీకి చెందిన ఒక మహిళ నూర్ అప్సర వద్దకు వచ్చి కాసేపు కూర్చుని వెళ్లింది.
పక్కనే చర్చి ఉండటంతో ఆదివారం ప్రార్థనలకు వచ్చిన మహిళలు ఇళ్లకు వెళ్లేంత వరకు ఆగింది. ఆ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న తొట్టెను వేపచెట్టుకు వేలాడుతున్న తాడు వద్దకు తెచ్చుకుని మెడలో ఉన్న బంగారు భరణాలు హ్యాండ్‌బ్యాగ్‌లో వేసి ఉరేసుకుంది. ఉరేసుకునే ముందు భర్తకు చెట్టుకు వేలాడుతున్న తాడు ఫొటో, ఆ ప్రాంతం ఫొటోలను వాట్సాప్‌లో పంపినట్లు తెలిసింది. చెట్టుకు మృతదేహం వేలాడుతుండగా, సాయంత్రం అటుగా వెళ్లిన కొందరు చూసి చుట్టుపక్కల వాళ్లకు చెప్పారు. రోడ్డు పక్కనే కావడంతో స్థానికులు మృతదేహాన్ని చూసేందుకు గుమిగూడారు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై యూవీ కృష్ణయ్య సిబ్బందితో అక్కడికి చేరుకుని వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలికి ముగ్గురు తోడబుట్టిన వారు ఉన్నారు. కులాంతర వివాహం చేసుకోవడంతో మృతదేహాన్ని చూసేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు.
Comments
Please login to add a commentAdd a comment