ప్రకాశం: నేరుగా ఆహారం, శ్వాస తీసుకోలేదు. ముక్కులో పైపుల సహాయంతో ద్రవాహారం, శ్వాస తీసుకునేందుకు గొంతులో పైపులు వేశారు. ఏడాదిగా మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునే స్థోమతలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోందా బాలిక. మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామ ఎస్సీకాలనీకి చెందిన పల్లెపోగు దావీదు, సునీతలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నలుగురు సంతానంలో మూడో కుమార్తె అయిన పల్లెపోగు మనీషా మండలంలోని తంగెళ్ల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. మంచి మెరిట్ కలిగిన విద్యార్థి అయిన మనీషాకు ఓ రోజు జ్వరం వచ్చింది.
బంధువులు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు అనంతరం వైద్యులు ఆమెకు మెదడువాపు ఉన్నట్లుగా గుర్తించారు. ఆపరేషన్ చేస్తేనే అమ్మాయి బతికేది. లేకపోతే చనిపోతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. రోజువారి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనీషాకు చికిత్స చేయించారు. మెదడులో వాపు తగ్గితే తప్ప ఆపరేషన్ చేయలేమని చెప్పడంతో మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేశారు.
ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలతో పాటు వారి సొంత డబ్బులు మరో రూ.5 లక్షలు ఖర్చుచేసినా పూర్తిగా కోలుకోలేదు. అప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో గత్యంతరం లేక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏడాది నుంచి మందులు వాడుకుంటూ నెట్టుకొస్తున్నారు. మనీషా ముక్కులో పైపుల సహాయంతో ఆహారాన్ని ద్రవ రూపంలో అందజేస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు గొంతులో పైపులు వేశారు. కుమార్తెకు నెలకు వైద్యానికి రూ.15 వేలు ఖర్చవుతున్నాయని తల్లి సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచం పట్టిన మనీషాకు ఆర్థిక సహాయం చేయాలని తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు.
ఏడాది నుంచి మంచంలో ఉన్న మనీషాను ఎడమ కన్నులోపించి పాక్షికంగా అంధురాలైన అక్క అనూషా అన్ని తానై సపర్యలు చేస్తూ దగ్గరుండి మరీ చూసుకుంటోంది. అప్పుచేసి ఇప్పటి వరకు దాదాపు రూ.3 లక్షలు వరకు ఖర్చు చేశామని, అయినా తన బిడ్డ కోలుకోలేదని తల్లి సునీత కంటనీరు పెట్టింది. చిన్న కుమార్తె కోసం పెద్ద కూతురు అనూషా డిగ్రీ మధ్యలోనే ఆపివేసిందని తెలిపింది. మంచం పట్టిన మనీషాకు ఆర్థిక సహాయం చేసి, పాక్షికంగా అంధురాలైన నా పెద్ద కుమార్తె అనూషాకు వికలాంగ సర్టిఫికెట్ అందజేసి పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన దాతలు సెల్‌నంబర్ 6302575798 ను సంప్రదించగలరని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment