
పింఛన్ నగదు మాయం
● పోలీసుల దర్యాప్తు
తర్లుపాడు: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చేందుకు రెండు రోజుల క్రితం బ్యాంకు నుంచి డ్రా చేసిన పింఛన్ సొమ్ము అదేరోజు మాయమైంది. ఈ ఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని కేతగుడిపి సచివాలయ పరిధిలో పంపిణీ చేయాల్సిన పింఛన్ రూ.15.36 లక్షల నగదును సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంటు మల్లిక గత నెల 29న బ్యాంకు నుంచి డ్రా చేసి నగదును బ్యాగులో పెట్టుకుని ఆటో ఎక్కుతుండగా క్యాష్ ఉన్న బ్యాగును ఆటోలో పెట్టగానే ఆటో డ్రైవరు ఉడాయించాడని మంగళవారం మార్కాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం గ్రామానికి చెందిన వృద్ధులు పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా సచివాలయ ఉద్యోగి వచ్చి పింఛన్ డబ్బులు కనిపించడం లేదని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నివ్వెరపోయారు. అప్పుడు సదరు ఉద్యోగిని మార్కాపురం పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి నగదు మాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సైదుబాబు తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. మరోవైపు అదే గ్రామానికి చెంది మరో ఉద్యోగి 31 మంది లబ్ధిదారులకు పింఛను అందించగా మిగిలిన వారు తమకు రాకపోవడంతో సచివాలయం వద్ద పింఛను డబ్బుల కోసం ఎదురుచూసున్నారు.

పింఛన్ నగదు మాయం