మేం సిద్ధం | Sakshi
Sakshi News home page

మేం సిద్ధం

Published Wed, May 8 2024 9:50 AM

మేం సిద్ధం

ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు

దేశభక్తి ఉన్నవారు ఓట్లేయండి

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్‌

దివ్యాంగులకు ఉచిత రాకపోకల సదుపాయం

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌

సమస్యాత్మక కేంద్రాల వద్ద

గట్టి భద్రత..

డీఆర్‌సీలు, స్ట్రాంగ్‌రూమ్స్‌, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శాంతిభద్రతల పరంగా 383 సమస్యాత్మక కేంద్రాలు సహా మొత్తం 1,046 పోలింగ్‌ కేంద్రాల వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. 14వేల మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు వైన్‌ షాపులు పోలింగ్‌కు 48 గంటల ముందే మూసివేయాల్సి ఉంటుందని తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో: లోక్‌సభ, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. నగరంలో పోలింగ్‌ ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం సీపీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ జిల్లాలో 45 శాతం పోలింగ్‌ మాత్రమే జరిగిందని చెబుతూ, ఈసారి పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. అయిదేళ్లకోసారి లభించే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని, దేశభక్తి, దేశంపై ప్రేమ ఉన్న వారు దేశం కోసం ఓటు వేయాలన్నారు. జిల్లాలోని 3,986 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ స్క్రీనింగ్‌ ఆడియోతో సహ ఉంటుందని, రాజకీయ పార్టీలు కోరితే ఫీడ్‌ అందజేస్తామని తెలిపారు. ఇంటింటికీ ఓటరుస్లిప్పుల పంపిణీ 81 శాతం పూర్తయిందని, 95 శాతం వరకు జరిగే వీలుందన్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 47 కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో 16,776 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లుండగా, ఇప్పటివరకు 9,266 మంది ఓట్లు వేశారన్నారు. మిగతావారికి 10వ తేదీ వరకు అ వకాశం కల్పిస్తామన్నారు. వికలాంగులు ‘సాక్షం’ యాప్‌లో పేరు నమోదు చేసుకుంటే ఇంటినుంచి పోలింగ్‌ కేంద్రం వరకు ఉచితంగా రాకపోకల సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 288 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. హోమ్‌ ఓటర్లు 571మందికి గాను ఇప్పటి వరకు 532 మంది ఓట్లు వేశారన్నారు. విధులకు హాజరు కాని సిబ్బందిలో వందమందికి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు.

దరఖాస్తు చేయని హౌసింగ్‌ సొసైటీలు

హౌసింగ్‌ సొసైటీలు కోరితే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు ఎన్నికల సంఘం అనుమతి ఉన్నప్పటికీ, జిల్లాలో తమకు పోలింగ్‌ కేంద్రం కావాలంటూ ఏ ఒక్క సొసైటీ కూడా లిఖితపూర్వకంగా కోరలేదన్నారు. పోలింగ్‌ రోజున వాణిజ్య దుకాణాలు, హోటళ్లు బంద్‌ పాటించాలన్నారు.

ఇంకా ఏమన్నారంటే..

● ఎండలు తీవ్రంగా ఉన్నందున బాధితులకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వైద్యసాయమందేలా ఏర్పాట్లు. ఇంటింటికీ ఓటరు స్లిప్‌లతోపాటు పోలింగ్‌కు సంబంధించి సమాచార పుస్తకాలు, స్టిక్కర్ల పంపిణీ.

● క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లుగా నియమితులైన 1,250 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎన్నికల సిబ్బంది అందరికీ అవసరమైన శిక్షణలు పూర్తి.

● గత అసెంబ్లీ ఎన్నికల మాదిరే పోలింగ్‌ కేంద్రం వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారో తెలుసుకునేలా పోల్‌క్యూ రూట్‌ యాప్‌ అందుబాటులో ఉంటుంది. గూగుల్‌ మ్యాప్‌తో పోలింగ్‌ కేంద్రం దారి కూడా తెలుసుకోవచ్చు.

● హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థిపై ఉల్లంఘనల కేసులు నమోదు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తప్పనిసరిగా మహిళా సిబ్బంది ఉండేలా ఏర్పాటు. వేలిపై పురుషులు ఇంక్‌మార్క్‌ వేస్తే ఇబ్బంది పడే వారుంటే.. మహిళా సిబ్బందితోనే ఇంక్‌ వేయించే ఏర్పాటు.

● ప్రచార గడువు ముగిశాక కూడా పత్రికలు, సోషల్‌ మీడియాలో ‘సైలెన్స్‌ ప్రచారం’ చేసుకోవచ్చు. వాటికి ముందస్తు అనుమతి అవసరం. ఏఎస్‌డీ(ఆబ్సెంట్‌,షిఫ్టెడ్‌,డెత్‌)ఓటర్లుగా ఇప్పటి వరకు 18వేల మందిని గుర్తించాం. ఈ సంఖ్య ఇంకా పెరగనుంది.

● సమావేశంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు అనుదీప్‌ దురిశెట్టి, హేమంత్‌ కేశవ్‌పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్‌ తేదీ తెలిపే ఓటరు స్టిక్కరు, ‘ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌’ తదితర స్టిక్కర్లను ప్రదర్శించారు.

Advertisement
 
Advertisement