చేవెళ్ల: రోడ్డుపై వెళ్తున్న స్కోడా కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి మొత్తం కాలిపోయింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముడిమ్యాల గేట్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని కేసారానికి చెందిన కె.రాజశేఖర్‌రెడ్డి తన స్కోడా కారులో గ్రామం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. మూడు కిలోమీటర్లు వెళ్లగానే కారు లోపలికి ఏసీ విండోల నుంచి మంటలు అకస్మాత్తుగా రావటంతో భయపడి ఆయన దిగాడు. ఈ క్రమంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ఒక్కడే ఉండటంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డాడు. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.