అక్కడి వూళ్ళలో కోళ్ళు మాయం అవుతున్నాయి. మాయం అవుతున్నాయంటే వూళ్ళలో దొంగలేమీ పడి ఎత్తుకుపోలేదు. పోనీ ఏ రోగమో వచ్చి నాటు కోళ్ళన్నీ చనిపోలేదు. కానీ, ఏడు మండలాల్లో నాటు కోళ్ళు కనిపించడంలేదంట. ఎందుకిలా జరిగింది. ఇంతకీ ఆ వూళ్ళు ఎక్కడున్నాయి?
పల్లెటూళ్ళలో నాటు కోళ్ళకు గిరాకీ ఎక్కువ. చాలా మంది ఇళ్ళలో పెంచుకుంటారు. బ్రాయిలర్ కోళ్ళు తిని విసుగు చెందినవారు కచ్చితంగా నాటు కోడిని తినాలనుకుంటారు. ఎంత రేటు పెట్టైనా కొనాలనుకుంటారు. సహజసిద్ధంగా పెరిగే నాటుకోడిలో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఇప్పుడు అదే నాటుకోడి ఉన్నట్లుండి నెల రోజుల్లోనే ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది. దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇలా జరిగింది? అక్కడేమన్నా కోళ్లకు రోగాలు వచ్చాయా అంటే అదేం లేదు. అక్కడ ఉప ఎన్నిక వస్తోంది. అదేంటి ఉప ఎన్నిక వస్తే నాటు కోళ్లు మాయం కావడం ఏంటనుకుంటున్నారా? విషయం అంతా అక్కడే ఉంది మరి..
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎక్కడ చూసినా ఎనికల వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల తేదీ అయితే రాలేదు గాని ..మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే పార్టీల కార్యకర్తలు, నేతలు, జనాలకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. విందులో బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటు కోళ్ళకే మక్కువ చూపిస్తున్నారట. అందుకే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాటు కోళ్ళన్నీ అక్కడికొచ్చేవారికి ఆహారంగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ నాటు కోళ్ళ కోసం దుర్భిణీ వేసి వెతికినా కనిపించడంలేదంటున్నారు. ఎక్కడైనా కనిపించినా..దాని ధర బంగారం స్థాయికి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు.
ఇదే సమయంలో నియోజకవర్గంలో మటన్‌కు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకు ముందుకు గొర్రెలు, మేకలు విరివిగా దొరికేవి. వాటి రేట్లు కూడా అంతో ఇంతో అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరిగి మటన్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రచార సభలు నిర్వహించే రాజకీయ పార్టీల నేతలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మీటింగులకు వచ్చేవారికి నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే వారు నారాజ్ అవుతున్నారట. ఒకవేళ ముక్క భోజనం పెట్టకపోతే మనసులో పెట్టుకుని ఎక్కడ ఓటు వేయరోనన్న ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోందట..
మొత్తానికి మునుగోడులో మటన్ ముక్కతో పాటు నాటుకోడికి కూడా తిప్పలొచ్చాయి. ఉప ఎన్నిక ఏమో గాని మాకు నాటు కోళ్ళు దొరకడంలేదని మునుగోడు నియోజకర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment