
జహీరాబాద్: యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు బంధు సాయం కోసం జిల్లా రైతాంగం ఎదురు చూస్తోంది. నవంబర్‌లోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పెట్టుబడి సాయం అందించే విషయంలో జాప్యం అవుతూ వస్తోంది. దీంతో రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం ఈనెల 10 నుంచి పెట్టుబడి సాయం ఇవ్వడం ప్రారంభించింది. అయినా అందరికీ డబ్బులు పడక పోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. ఇంకా ఎప్పుడు తమ ఖాతాల్లో జమ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో మొత్తం 4,16,210 మంది రైతులు ఉన్నారు. వీరికి రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,14,793 మంది రైతులకు గాను రూ.23.50 కోట్లు మాత్రమే ఖాతాల్లో జమ అయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
పాత పద్ధతిలోనే సాయం
పంట సాగు కోసం అవసరమైన పెట్టుబడి కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.5వేల వంతున రైతులందరి ఖాతాల్లో జమచేసిన విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌కు సైతం రైతుబంధు ఇచ్చే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.7,500 వంతున ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఎకరానికి రూ.5వేల వంతున అందిస్తోంది.
పెట్టుబడి కోసం ఇబ్బంది
యాసంగిలో పంటలను సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో రైతు బంధు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అప్పులు పుట్టని రైతులు పంటల సాగును ఆలస్యం చేశారు. యాసంగిలో రైతులు ప్రధానంగా ఆలుగడ్డ, గోధుమ, మొక్కజొన్న, చెరకు, ఉల్లిగడ్డ, కూరగాయలను సాగు చేస్తారు. ఆయా పంటల సాగు కోసం అవసరమైన పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు.
