కుటుంబ కలహాలే కారణం
జగదేవ్‌పూర్ మండలంలో ఘటన
అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆరేళ్లుగా కలిసున్నారు.. ఏడా ది నుంచి కుటుంబ కలహాలతో విడిపోదామనుకున్నారు.. ఇంతలోనే పురుగుల మందు తాగి దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన అకారం నర్సింలు, లక్ష్మీ దంపతుల కూతురు సౌమ్య(25)ను ఆరేళ్ల కిందట ఇటిక్యాల గ్రామానికి చెందిన కర్కపట్ల శేఖర్(36)కు ఇచ్చి వివాహం చేశారు. శేఖర్, సౌమ్య గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఎనిమిది నెలల కిందట నుంచి మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో మామిడి తోటలో శేఖర్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఐదేళ్లలోపు శివాన్స్, బిట్టు పిల్లలు ఉన్నారు. ఐదేళ్లపాటు దంపతులిద్దరూ బాగానే ఉన్నప్పటికీ ఏడాది నుంచి కుటుంబంలో ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవలు జరుగు తుండటంతో సౌమ్య తల్లిదండ్రులు, పంచాయతీ పెద్దలు నచ్చజెప్పారు. అయినప్పటికీ ఇద్దరిలో మార్పు రాకపోవడంతో చివరికి విడాకుల వరకు వచ్చింది. ఏడాది నుంచి సౌమ్య అమ్మగారింటి వద్దే ఉంటుంది. రెండు నెలల కిందట సౌమ్య తల్లి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందింది.
పదిహేను రోజుల కిందట శేఖర్ దౌలాపూర్‌కు వచ్చి భార్య సౌమ్యను తీసుకొని తుర్కపల్లికి వెళ్లాడు. మంగళవారం రాత్రి తుర్కపల్లి నుంచి ఇద్దరు బైక్‌పై ఇటిక్యాల గ్రామంలో తమ వ్యవసాయ పొలం వద్దకు వచ్చి పురుగుల మందు తాగారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అపస్మారకస్థితిలో ఉన్న దంపతులను 108 ద్వారా గజ్వేల్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సౌమ్య మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శేఖర్ మృతి చెందాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment