మున్సిపాలిటీలవైపే మొగ్గు | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీలవైపే మొగ్గు

Published Wed, Mar 19 2025 7:57 AM | Last Updated on Wed, Mar 19 2025 7:57 AM

మున్సిపాలిటీలవైపే మొగ్గు

మున్సిపాలిటీలవైపే మొగ్గు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పలు గ్రామాలను ప్రభుత్వం ఇటీవల సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. మరికొన్ని గ్రామాలతో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఇలా విలీనమైన గ్రామాలు, కొత్త మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఇకపై మున్సిపాలిటీ శాఖలో పనిచేస్తారా..? లేదా పంచాయతీరాజ్‌ శాఖలో కొనసాగుతారా? అనే దానిపై నిర్ణయం తెలపాలని మున్సిపల్‌శాఖ ఆప్షన్లు కోరింది. దీంతో ఎక్కువమంది పంచాయతీ కార్యదర్శులు మున్సిపాలిటీల్లో పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.

రెండు విడతలుగా నిర్ణయం..

జిల్లాలో మొదటి విడతలో పటాన్‌చెరు మండలంలోని ఐదు గ్రామాలను తెల్లాపూర్‌ మున్సిపాలిటీలో విలీనం చేసింది. అలాగే అమీన్‌పూర్‌ మండలంలోని ఆరు గ్రామాలను అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో కలిపింది. ఇలా మొత్తం 11 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆరు నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. రెండో విడతలో ఇస్నాపూర్‌, గుమ్మడిదల, గడ్డపోతారం గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చుతూ జనవరి మొదటి వారంలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 14 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. మరోవైపు కొహీర్‌ గ్రామ పంచాయతీ కూడా మున్సిపాలిటీగా మారింది. ఇలా మొత్తం 26 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. అయితే ఈ 25 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పర్మినెంట్‌ ఉద్యోగులు ఇకపై పంచాయతీరాజ్‌శాఖలోనే కొనసాగుతారా..? మున్సిపాలిటీల్లో ఉంటారా? అనే అంశంపై మున్సిపల్‌శాఖ ఇటీవల ఆప్షన్లను అడిగింది. నలుగురైదుగురు మినహా మిగిలిన వారంతా మున్సిపల్‌ శాఖ వైపే మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అర్బన్‌ ఏరియాల్లో పనిచేసే అవకాశం కోసం..

మున్సిపల్‌శాఖలోకి వెళితే అర్బన్‌ ఏరియాలో పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతో చాలామంది మున్సిపాలిటీల్లో ఆప్షన్లు ఇచ్చే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్‌శాఖలోకి వెళితే సీనియారిటీ అంశం అటుంచితే కాస్త తొందరగా పదోన్నతులు వచ్చే అవకాశాలున్నాయి. గ్రేడ్‌–1 కార్యదర్శి మున్సిపాలిటీలో మేనేజర్‌ క్యాడర్‌ పోస్టు వస్తుంది. ఇది కూడా ఎక్కువ మంది మున్సిపాలిటీ వైపు వెళ్లేందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తక్షణ పదోన్నతుల జాబితాలో ఉన్న అతి కొద్దిమంది మాత్రమే పంచాయతీరాజ్‌శాఖలో కొనసాగాలని భావిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది విలీన గ్రామ పంచాయతీల్లో డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు. ఇలా డిప్యూటేషన్లపై కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

విలీన పంచాయతీల కార్యదర్శులకు ఆప్షన్లు అడిగిన మున్సిపల్‌ శాఖ

బల్దియాల్లో పనిచేసేందుకే ఎక్కువమంది ఆసక్తి

జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లోకి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement