కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Published Sat, Mar 22 2025 9:12 AM | Last Updated on Sat, Mar 22 2025 9:11 AM

కొల్చారం(నర్సాపూర్‌): ఎదురుగా వస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కారు డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రం సమీపంలో మెదక్‌–నర్సాపూర్‌ జాతీయ రహదారి లోతు వాగు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్‌ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన పిల్లి మల్లేశం(38) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం మెదక్‌కు కారులో వచ్చాడు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో మండల శివారులోని జాతీయ రహదారి లోతు వాగు మలుపు వద్దకు రాగానే సికింద్రాబాద్‌ వైపు నుంచి మెదక్‌ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తినడంతోపా టు డ్రైవర్‌ మల్లేశంకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు మెదక్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ప్రమాదంలో మహిళ

రాయికోడ్‌ (అందోల్‌ ): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సింగితం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నారాయణ కథనం మేరకు.. రేగోడ్‌ మండలం చౌదర్‌ పల్లి గ్రామానికి చెందిన మణెమ్మ (53) రాయికోడ్‌ మండలం హస్నాబాద్‌లో బంధువుల శుభకార్యానికి గురువారం బొలెరో వాహనంలో కులస్తులతో హాజరయ్యారు. సాయంత్రం తిరుగు ప్రయాణం కాగా సింగితం గ్రామానికి చేరుకోగానే బొలెరో వాహనం అదుపుతప్పింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై మణెమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహన డ్రైవర్‌ రాములుపై మృతురాలి భర్త నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

బైక్‌ అదుపుతప్పి కూలీ..

దుబ్బాకటౌన్‌ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి కూలీ మృతి చెందిన ఘటన రాయపోల్‌ మండలం వడ్డేపల్లి గ్రామ పరిధిలోని గుర్రాలసోఫా వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం రాయపోల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా చేగుంట మండలం కసాన్‌ పల్లి గ్రామానికి చెందిన లింగ రమేశ్‌ (39) వ్యవసాయం, సెంట్రింగ్‌ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రతిరోజూ గజ్వేల్‌ పట్టణానికి సెంట్రింగ్‌ కూలి పనికి బైక్‌పై వెళ్తుంటాడు. గురువారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో వడ్డేపల్లి గ్రామ పరిధిలోని గుర్రాలసోఫా సమీపంలో బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపోల్‌ ఎస్‌ఐ రఘుపతి తెలిపారు.

ఆటో బోల్తా పడి మహిళ..

కొమురవెల్లి(సిద్దిపేట): ఆటో బోల్తా పడి మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం మేరకు.. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన సబిత(55) కుటుంబంతో కలిసి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో వేచరేణి కి చెందిన ఆటోలో బయలు దేరారు. మండల కేంద్రంలోని పద్మశ్రీ గార్డెన్‌ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సబిత మృతి చెందగా, పలువురి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఒకరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement