
నీట మునిగిన బావ బామ్మర్దులు
హత్నూర (సంగారెడ్డి): ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. హత్నూర మండల పరిధిలోని బోరుపట్ల గ్రామ శివారులో భీమునిచెరువులో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామస్తుల కథనం ప్రకారం...బోరుపట్ల గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల కోసం మల్కాపూర్ గ్రామపంచాయతీలోని కుతుప్ షాహీపేట గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ భార్యా పిల్లలతో కలసి అత్తవారింటికి చుట్టపుచూపుగా వచ్చారు. మధ్యాహ్నం చెరువులోకి స్నానం చేసేందుకు ప్రేమ్ కుమార్ చెరువులో దిగాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నీట మునిగిపోయాడు. ఎంతసేపటికీ పైకి రాకపోవడంతో అక్కడున్న మరికొందరు గ్రామంలోని ఆయన బంధువులకు సమాచారమిచ్చారు. భార్యా పిల్లలతోపాటు బంధువులు గ్రామస్వారిలోని భీముని చెరువు వద్దకు వచ్చి అతడి కోసం గాలించారు.
బావకోసం...
ప్రేమ్‌కుమార్ బావమరిది బోరుపట్ల గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్ మరికొంతమంది యువకులతో కలసి చెరువులోకి దిగాడు. కొద్ది సేపటి తర్వాత నవీన్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కొంతమంది యువకులు చెరువులోకి దిగి ఈ యువకులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలికి తహసీల్దార్ పరిహీన్ షేక్, ఎంపీడీవో శంకర్ ఎస్సై సుభాష్, ఆర్ ఐ శ్రీనివాస్ చేరుకుని సహాయక చర్యలో పాల్గొన్న సహాయక బృందాలకు పలు సూచనలు చేశారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.
స్నానానికి వెళ్లి ఒకరు...
కాపాడబోయి మరొకరు
రాత్రివరకూ తెలియని ఆచూకీ
పొద్దుపోవడంతో
ఆపేసిన గాలింపు చర్యలు
బోరుపట్ల గ్రామంలో ఘటన

నీట మునిగిన బావ బామ్మర్దులు