
హుస్నాబాద్: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ప్రస్తావన తెచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఆ పార్టీ సభ్యులు చెబుతున్న తరుణంలో హుస్నాబాద్‌లో శిథిలావస్థకు చేరుకున్న ఓ రేకుల ఇంటి ఫొటోను చూపిస్తూ పొన్నం చర్చించారు. పట్టణం కేబీ కాలనీలోని గృహం శిథిలావస్థలో ఉన్నందున ‘ఈ గృహంలో నివసించరాదు.
ఒక వేళ నివసిస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది’ అని గోడపై రాశారని తెలిపారు. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఆ ఇంటి యాజమానికి డబుల్ బెడ్రూం ఎందుకు ఇవ్వలేదని, అభివృద్ధి అంటే ఇదేనా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.