
నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పుల్లూరుకు చెందిన కర్రె సంజీవ్(18) వారం రోజుల కిందట స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో తండ్రి బాలయ్యతో కలిసి భోజనం చేసి పడుకుంటానని చెప్పి లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికి ఓ వ్యక్తి వచ్చి సంజీవ్ ఉన్నాడా.. అని తండ్రిని అడిగాడు. ఇంట్లో పడుకున్నాడని చెబుతూ గది తలుపులు తెరిచి చూడగా సంజీవ్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. సంజీవ్ దొంగతనం చేసిన విషయం చిన్న కుమారుడు తండ్రికి చెప్పాడు. నాన్న తిడతాడనే భయంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన కుమారుడి మరణంపై ఎలాంటి అనుమానం లేదని బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.