
సాగు పెంపునకు ఏం చేద్దాం?
గజ్వేల్: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే ద్రాక్ష సాగుకు బీజం పడింది. 1890లో ఎనాబ్–ఇ–సాహి ద్రాక్ష రకాన్ని హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ బక్వీర్ అనే వ్యక్తి సాగు చేశారు. ఆ తర్వాత కాలం 1960లో దివంగత హార్టికల్చరిస్ట్ శంకర్‌పిల్‌లై ఇదే రకాన్ని అభివృద్ధి చేసి నగరంలో సాగు చేశారు. హెక్టారుకు 105 టన్నుల దిగుబడిని సాధించి ప్రపంచ రికార్డు సాధించారు. దీని ద్వారా ద్రాక్ష సాగుకు తెలంగాణ పుట్టినిల్లుగా మారింది. ఇదే క్రమంలో పదిహేనేళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఈ తోటల సాగుకు ఆధారంగా ఉండేవి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా కొంత విస్తీర్ణం సాగయ్యేది. ఆయా జిల్లాల్లో మొత్తంగా ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటలు సాగులోకి వచ్చేవి. విదేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదపడే రకాలను ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే నిపుణులైన కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని ఎకరాకు రూ.10లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది. ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలు బాగానే గడించారు. ఆ తర్వాత కాలంలో తోటలు తెగుళ్ల బారిన పడటం వరుసగా చోటుచేసుకుంది. దీంతో రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రోత్సాహాం కరువైంది. ఈ దశలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు ద్రాక్ష తోటలను తొలగించి తమ భూములను ప్లాట్లుగా మార్చారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ, సిద్దిపేట జిల్లా ములుగులోని కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలుచేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే ములుగు యూనివర్సిటీ పరిధి రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఇటీవల గ్రేప్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ ఛాన్స్‌లర్ డాక్టర్ శిఖామణి, ద్రాక్ష సాగులో తనకుంటూ ప్రత్యేకతను చాటుకున్న మేడ్చల్ జిల్లా శామీర్‌పేటకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగుపై తగ్గడానికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌కు సమీపంలోని ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలోని భూములన్నీ రియల్ వ్యాపారం కారణంగా బడా బాబులు చేతులకు వెళ్లిపోవడం, ద్రాక్ష సాగుకు కూలీలు సమస్యగా మారడం, పెట్టుబడి లక్షల్లో ఉండటం, ఎరువులు, క్రిమిసంహారకాల నిర్వహణ కష్టతరంగా మారడం వంటి కారణాల వల్ల క్రమంగా సాగు పడిపోతోంది. ఈ క్రమంలోనే ఏటా కొత్తగా ద్రాక్ష సాగు పెరిగేలా ఏంచేయాలనే అంశంపైనా కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు అవగాహన కల్పించి ఈ నేలలకు అనుకూలమైన రకాలను ఎంచుకొని సాగు చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు.