‘‘టీమిండియా ప్రాక్టీస్ చేసిన మొదటిరోజు నేను నెట్స్ వద్దకు వెళ్లాను. అప్పుడు హార్దిక్- రోహిత్ దూరదూరంగా ఉండటం గమనించాను. నిజానికి ఆరోజు వారు మాట్లాడుకోలేదు. అయితే, రెండో రోజు నుంచి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్లిద్దరు ఒకరికొకరు చేరువగా వచ్చారు.
ఓ మూలన కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. నిజానికి అక్కడ కెమెరా కూడా లేదు. వాళ్లిద్దరినీ అలా చూసి నేను నమ్మలేకపోయాను. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లు తమ మధ్య విభేదాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు సాగుతారని అప్పుడే నాకు కళ్లకు కట్టినట్లయింది.
ఆ తర్వాత మూడు రోజుల పాటు రోహిత్, హార్దిక్ కలిసే బ్యాటింగ్ చేశారు. హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నపుడు రోహిత్ దగ్గరుండి పర్యవేక్షించాడు. వారిని అలా చూస్తే ముచ్చటేసింది’’ అంటూ స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుబంధం గురించి తెలిపాడు.
కారణం అతడే
టీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణమని పేర్కొన్నాడు. ఈ విషయంలో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని.. ద్రవిడ్ చొరవ వల్లే డ్రెస్సింగ్ రూం వాతావరణం అంత చక్కగా ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్ల మధ్య విభేదాలంటూ వచ్చే వార్తలు నిజం కావని వారిని దగ్గరగా చూసిన తర్వాతే తనకు అర్థమైందన్నాడు విమల్ కుమార్. టూ స్లాగర్స్ అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
అందుకే విభేదాలు?
ఐపీఎల్-2024కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై ఇండియన్స్.. ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు తీవ్రస్థాయిలో హార్దిక్‌పై మండిపడ్డారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. మరోవైపు.. హార్దిక్ సైతం మైదానంలో రోహిత్ ఫీల్డింగ్ పొజిషన్‌ను పదే పదే మారుస్తూ కాస్త అతి చేశాడు. ఈ క్రమంలో రోహిత్ కూడా హార్దిక్ తీరు పట్ల అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి.
కలిసిపోయారు
ఈ నేపథ్యంలో తాజా సీజన్‌లో ముంబై దారుణంగా ఓడిపోవడంతో ఆటగాళ్ల మధ్య సఖ్యత లోపించడమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. అయితే, టీ20 ప్రపంచకప్-2024లో సీన్ మారింది. రోహిత్ కెప్టెన్‌గా.. హార్దిక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.
దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇందులో రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర కూడా కీలకం. ఇక అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో టీమిండియాతో పాటే ఉన్న విమల్ కుమార్ తాజాగా రోహిత్- హార్దిక్ జట్టు కోసం కలిసిపోయారంటూ పాజిటివ్ కామెంట్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment