దుబాయ్: వరుసగా రెండేళ్లు రెండు టి20 ప్రపంచకప్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పుడు వాటి వేదికల విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగించింది. కరోనా కారణంగా ఈ అక్టోబర్ – నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ ఏడాది వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఆస్ట్రేలియాకు రెండేళ్ల తర్వాతే అవకాశం దక్కుతోంది. ఆస్ట్రేలియాకు 2022 టి20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఇస్తున్నట్లు శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. గత షెడ్యూల్ తరహాలో 2021లో జరగాల్సిన టి20 వరల్డ్ కప్ వేదికను మాత్రం కొనసాగించారు. ఇందులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
2023లో భారత్‌లోనే వన్డే వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహణా పరమైన సమస్యల కారణంగా వరుసగా రెండేళ్లు రెండు వరల్డ్ కప్‌లు నిర్వహించడం సాధ్యం కాదంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన వాదనకు ఐసీసీ సమావేశంలో ఆమోదం లభించింది. తాము ఆతిథ్యమిచ్చే టోర్నీ వాయిదా పడింది కాబట్టి తమకే 2021లో అవకాశం ఇవ్వాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) కోరినా లాభం లేకపోయింది. చివరి టి20 ప్రపంచకప్ కూడా భారత్‌లోనే (2016)లోనే జరగడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఇప్పుడు అదే వేదికపై టైటిల్ నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగుతుంది. గతంలోనే ఐసీసీ ప్రకటించిన విధంగా వరుసగా మూడేళ్లలో జరిగే రెండు టి20 ప్రపంచకప్, వన్డే వరల్డ్ కప్ కూడా అక్టోబర్–నవంబర్‌లోనే నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment