టీ20 వరల్డ్‌కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా రువాండతో నిన్న (నవంబర్ 27) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు (కెప్టెన్) సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వే తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో (2.4-0-3-3) పాటు బ్యాట్‌తోనూ (36 బంతుల్లో 58; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జింబాబ్వే 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
పరుగుల పరంగా టీ20ల్లో జింబాబ్వేకు ఇదే అత్యుత్తమ విజయం. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన రజా.. ఈ ఏడాది రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ రికార్డును కూడా సమం చేశాడు. ఈ ఏడాది విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా.. నిన్నటి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో రజా విరాట్ రికార్డును (6) సమం చేశాడు.
ఈ టోర్నీలో ఉగాండ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమిపాలైన జింబాబ్వే తాజా గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి వరల్డ్‌కప్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించనుండగా.. నమీబియా, ఉగాండ, కెన్యా జట్లు రేసులో ముందున్నాయి. ఈ మూడు జట్ల తర్వాతి స్థానంలో జింబాబ్వే ఉంది. ఈ టోర్నీలో జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు (నైజీరియా, కెన్యా) ఆడాల్సి ఉంది.
కాగా, రువాండతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. సికందర్ రజాతో పాటు మరుమణి (50), ర్యాన్ బర్ల్ (44 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రువాండ.. రిచర్డ్ నగరవ (3/11), సికందర్ రజా (3/3), ర్యాన్ బర్ల్ (2/7) ధాటికి 71 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment