డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌, ఐపీఎల్‌ ఫైనల్‌ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..! | Sakshi
Sakshi News home page

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌, ఐపీఎల్‌ ఫైనల్‌ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!

Published Mon, May 27 2024 1:02 PM

2024 WPL Final And 2024 IPL Final Has Very Similar Equations In Terms Of Figures And Captains

క్రికెట్‌ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్‌ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ (ఆసీస్‌ కెప్టెన్‌) టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్‌ కైవసం చేసుకుంది.

ఐపీఎల్‌ 2024 ఫైనల్లోనూ అలాగే..
నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్‌ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ (ఆసీస్‌ కెప్టెన్‌) పాట్‌ కమిన్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 

మహిళల ఐపీఎల్‌లోనూ ఇలాగే ఆసీస్‌ కెప్టెన్‌ (మెగ్‌ లాన్నింగ్‌) టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐపీఎల్‌ ఫైనల్లో కమిన్స్‌ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ కెప్డెన్‌ (ఢిల్లీ కెప్టెన్‌) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).

ఐపీఎల్‌ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ (ఆసీస్‌ కెప్టెన్‌) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్‌ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోనూ టాస్‌ గెలిచిన ఢిల్లీ (ఆసీస్‌ కెప్టెన్‌) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. 

ఐపీఎల్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌ అయిన శ్రేయస్‌.. ఆసీస్‌ కెప్టెన్‌ నేతృత్వంలోని సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లోనూ ఆసీస్‌ కెప్టెన్‌ లాన్నింగ్‌ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్‌ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌, ఐపీఎల్‌కు పోలికలు ఉండటంతో క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement