Teamindia Beat Pakistan To Lift Inaugural T20 World Cup On This Day: పొట్టి క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించి నేటికి 14 ఏళ్లు అవుతుంది. 2007 సెప్టెంబర్ 24న టీమిండియా తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌కు కైవసం చేసుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ధోని నేతృత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ధోని సేన 5 పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా అవతరించింది. అంతకుముందు కపిల్ నేతృత్వంలో భారత జట్టు 1983 వన్డే ప్రపంచకప్ నెగ్గింది.
జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ తుది సమరంలో ధోని ప్రపంచకప్‌కు ముద్దాడటం భారత్ క్రికెట్ అభిమానుల మదిలో నేటికీ మెదులుతూనే ఉంది. దీని తర్వాత మరోసారి టీమిండియా ధోని నేతృత్వంలోనే వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా(2011) అవతరించినా.. తొలి పొట్టి ప్రపంచకప్ గెలవడం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఆడిన స్కూప్ షాట్‌కు శ్రీశాంత్ పట్టిన క్యాచ్‌ను ఏ భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. ఏమాత్రం అనుభవం లేని జోగిందర్ సింగ్‌తో ఆఖరి ఓవర్ బౌల్ చేయించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ధోనిపై యావత్ క్రికెట్ ప్రపంచం పొగడ్తల వర్షం కురిపించింది.
ఇక, మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్((54 బంతుల్లో 75; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ(16 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్‌కు 3 వికెట్లు దక్కగా, సోహైల్ తన్వీర్, మహ్మద్ ఆసిఫ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో పాక్.. పడుతూ లేస్తూ లక్ష్యానికి మరో 5 పరుగుల దూరంలో(19.3 ఓవర్లలో 152) ఆలౌటైంది. భారత బౌలర్లు ఇర్ఫాన్ పఠాన్(3/16), ఆర్పీ సింగ్(3/26), జోగిందర్ శర్మ(2/20), శ్రీశాంత్(1/44) పాక్ నడ్డివిరిచారు. మూడు వికెట్లతో పాక్‌కు దెబ్బకొట్టిన ఇర్ఫాన్ పఠాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. పాక్ ప్లేయర్ షాహిద్ అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్ స్టైల్‌ను దింపేశాడు..
Comments
Please login to add a commentAdd a comment