‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. పేసర్లకు కోహ్లి ఉద్బోధ | For 60 Overs They Should Feel Hell Out There, Virat Kohli Gives Motivational Speech Before England Second Innings | Sakshi
Sakshi News home page

‘ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి’.. కోహ్లి మాటను నిజం చేసిన భారత పేసు గుర్రాలు

Published Tue, Aug 17 2021 3:52 PM | Last Updated on Tue, Aug 17 2021 6:01 PM

For 60 Overs They Should Feel Hell Out There, Virat Kohli Gives Motivational Speech Before England Second Innings - Sakshi

లండన్‌: 'ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి'..ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభానికి ముందు సహచరులతో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి చెప్పిన మాట ఇది. అన్నట్లుగానే భారత పేసు గుర్రాలు ప్రత్యర్థిపై నిప్పులు చెరిగే బంతులతో ఎదురుదాడికి దిగి ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో వారికి రుచి చూపించారు.  బుల్లెట్లలా దూసుకొచ్చే ఒక్కో బంతిని ఎదుర్కొలేక ఇంగ్లీష్‌ జట్టు 120 పరుగులకే కుప్పకూలడంతో కోహ్లి సేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి రోజు ఆటలో మొదట బ్యాటింగ్‌లో మెరిసిన మన పేసర్లు(షమీ, బుమ్రా) తిరిగి బౌలింగ్‌తోనూ బెంబేలెత్తించారు. దీంతో లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

కాగా, చివరి రోజు ఆటలో టీమిండియా టెయిలెండర్లు షమీ(70 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), బుమ్రా (64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) అద్భుత పోరాట పటిమ కనబర్చడంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 298 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో చివరి రెండు సెషన్లలో భారత విజయానికి 10 వికెట్ల అవసరమవ్వగా.. ఇంగ్లండ్ గెలవాలంటే 60 ఓవర్లలో 272 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మైదానంలోకి దిగేముందు కెప్టెన్ కోహ్లి జట్టు సభ్యులతో మాట్లాడాడు. తన మోటివేషనల్ స్పీచ్‌తో సహచరుల్లో స్పూర్తిని రగిల్చాడు. ఈ 60 ఓవర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లకు నరకం చూపించాలనే మాటలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

అన్నట్లుగానే, టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ కేవలం ఒక్క పరుగుకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం భారత పేసర్ల దూకుడు ముందు ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్లు నిలదొక్కుకోలేక చేతులెత్తేశారు. ఏ దశలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కుదురుకున్న పరిస్థితి కనపడలేదు. భారత పేస్‌ దళం క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ప్రత్యర్ధి పతనాన్ని శాశించింది. ఆట ముగియడానికి మరో 9.1 ఓవర్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్‌ చేతిలో 3 వికెట్లు ఉండటంతో మ్యాచ్‌ డ్రా అవుతుందేమోనని అందరూ భావించారు. కానీ, రాబిన్సన్‌ (9)ను అవుట్‌ చేసి బుమ్రా టీమిండియా గెలుపుకు బాటలు వేయగా.. ఒకే ఓవర్లో బట్లర్‌ (25), అండర్సన్‌ (0)లను పెవిలియన్‌ పంపించి సిరాజ్‌ మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో 19 వికెట్లు భారత పేసర్ల ఖాతాలో పడడం విశేషం. 
చదవండి: ENG Vs IND: లార్డ్స్‌లో టీమిండియా విజయం.. వైరలవుతున్న ట్రోల్స్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement