తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌.. భావోద్వేగాలు, సంబరాలు | Afghanistan Are Through To The Semi-Final Of 2024 T20 World Cup, Celebration All Over The Country | Sakshi
Sakshi News home page

తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌.. భావోద్వేగాలు, సంబరాలు

Published Tue, Jun 25 2024 1:16 PM | Last Updated on Tue, Jun 25 2024 5:23 PM

AFGHANISTAN ARE THROUGH TO THE SEMI FINAL OF 2024 T20 WORLD CUP, CELEBRATIONS ALL OVER THE COUNTRY

ఒకప్పటి క్రికెట్‌ పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ ఇప్పుడు ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 వరల్డ్‌కప్‌-2024 బరిలోకి దిగిన ఆ జట్టు.. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ లాంటి మేటి జట్లపై సంచలన విజయాలు సాధించి తొలిసారి ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు చేరింది. 

ఇవాళ (జూన్‌ 25) జరిగిన సూపర్‌-8 సమరంలో బంగ్లాను మట్టికరిపించిన ఆఫ్ఘన్లు.. ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించి, క్రికెట్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు. బంగ్లాపై గెలుపు అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌, బౌలింగ్‌ కోచ్‌ డ్వేన్‌ బ్రావో కూడా ఆఫ్ఘన్ల గెలుపు సంబరాల్లో భాగమయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే ఈ సందర్భాన్ని ఆఫ్ఘన్లతో పాటు ప్రతి క్రికెట్‌ ప్రేమికుడు సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఆఫ్ఘన్‌ పౌరుల సంబరాలు, భావోద్వేగాలు మాటల్లో వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ నగర వీధులు తమ దేశ ఆటగాళ్ల నామస్మరణతో మార్మోగాయి. 

 ఆఫ్ఘన్లు బహుశా తమకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కూడా ఇంతలా సంబురాలు చేసుకుని ఉండరు. కాబుల్‌ సహా దేశంలోని ప్రతి నగరంలో జనాలు రోడ్లపైకి వచ్చి సమూహిక సంబురాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాళ్ల గెలుపు సంబరాలు వైరలవుతున్నాయి.

కాగా, వరుణుడి అంతరాయాల నడుమ సాగిన సూపర్‌-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్‌ సెమీస్‌కు చేరగా.. గ్రూప్‌-1 నుంచి సెమీస్‌ రేసులో ఉండిన బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా ఒకేసారి ఇంటిముఖం పట్టాయి.

ఇదిలా ఉంటే, బంగ్లాపై ఆఫ్ఘనిస్తాన్‌ గెలుపుతో టీ20 వరల్డ్‌కప్‌ 2024లో నాలుగు సెమీస్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-1 నుంచి భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌.. గ్రూప్‌-2 నుంచి సౌతాఫ్రికా జట్లు ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించాయి. జూన్‌ 26న జరిగే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ తలపడనుండగా.. ఆతర్వాతి రోజు జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా, ఇంగ్లండ్‌ జట్లు ఢీకొంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement